CM KCR | గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(బుధవారం) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఏకబిగిన మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. మొదట నిజామాబాద్ జిల్లా బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నిర్వహించే సభకు హాజరవుతారు. స్థానిక ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా మూడు నియోజకవర్గ కేంద్రాలు గులాబీమయమయ్యాయి. హెలీకాప్టర్‌లో రానున్న గులాబీ దళపతి.. సుడిగాలి పర్యటన చేయనున్నారు. జననేతను చూసేందుకు ప్రజలు భారీగా తరలిరానుండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వయంగా ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నిజామాబాద్, నవంబర్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేడు (బుధవారం) ఉమ్మడి జిల్లాకు రానున్నారు. రెండో విడుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకే రోజు మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. మొదటగా బోధన్ నియోజకవర్గానికి వస్తారు. ఇక్కడ జరిగే ప్రజా సభలో మధ్యాహ్నం ఒంటి గంటకు పాల్గొంటారు. 2 గంటల తర్వాత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ప్రచార కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సభను గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఇక్కడి సభ జరుగుతుంది. మధ్యాహ్నం 3గంటలకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ హాజరవుతారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ చెప్పే విషయాలను స్వయంగా ఆలకించేందుకు జనాలు ఆసక్తితో ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి నియోజకవర్గల్లో గులాబీమయమైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వస్తున్న సీఎం కేసీఆర్.. మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తారు.
ఇప్పటి వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను సీఎం కేసీఆర్ తన పర్యటనలతో దాదాపుగా చుట్టేశారు. బుధవారం జరగబోయే మూడు సభలతో ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత ప్రచారం పూర్తయినట్లే. ఇక మిగిలింది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం. ఇక్కడ కూడా గులాబీ బాస్ గురువారం పర్యటించనున్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులోని గాంధీనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభకు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జనసమీకరణతో పాటు సభను విజయవంతం చేసేందుకు మండలాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మొదటి విడుత ప్రచారంలో భాగంగా జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ టూర్ కొనసాగింది. ఆ తర్వాత నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్‌లో సభలు నిర్వహించారు. నవంబర్ 9న కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో దాదాపు పొద్దంతా ఉన్నారు. నాయకులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. రెండో విడుత ప్రచారంలో ఒకే రోజు బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డిలో సీఎం పర్యటనలు ఉండగా, తెల్లారి నిజామాబాద్ రూరల్ టూర్‌తో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉమ్మడి జిల్లాలో పరిసమాప్తం కానున్నది.
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రాజకీయ చైతన్యం, ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని తెలంగాణ ఉద్యమ నాయకత్వం పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులన్నీ ఏకమై మరోసారి తెలంగాణను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాకారమైనప్పటికీ మళ్లీ అవే పాత్రలు వేర్వేరు డైలాగులు, వేషాలతో మరోసారి తెలంగాణపై దండయాత్రకు వస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికలు ఏవైనా.. ఓటమి లేకుండా బీఆర్ఎస్ జైత్రయాత్రను కొనసాగించింది. ఇప్పుడు కూడా అదే తోవలో గులాబీ జెండా పయనిస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కల సాకారం అయ్యింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి అనుమానాలు పటా పంచలు చేస్తూ వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. ఉద్యమ సమయంలో ఎగతాళి చేసిన వ్యతిరేక శక్తులతో నేడు తెలంగాణ మరోసారి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నది. ఎన్నికల్లో ఒక పార్టీ గెలవడం, మరో పార్టీ ఓడిపోవడం సాధారణమే.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నవి అలాంటి సాధారణ ఎన్నికలు కావు. కుట్రలు, కుతంత్రాలతో ముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీలు ఒక వైపు, ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతూ ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ మరోవైపు. ఈ పోరులో గులాబీ జెండానే ఎన్నికల్లో రెపరెపలాడడం ఖాయమన్నది అనేక విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నాయి.