ఆర్మూర్‌టౌన్, నవంబర్14: ఫ్లెక్సీ తెచ్చిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాటకు కారణమైంది. ఆర్మూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ, ఎమ్మెల్యే ఫొటో పెట్టక పోవడంతో మొదలైన ప్రొటోకాల్ వివాదం రెండు పార్టీల నాయకులు నెట్టివేసుకునే దాకా వెళ్లింది. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి నిజామాబాద్ జిల్లాలో గురువారం పర్యటించారు. ధాన్యం సేకరణ, సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.
మంత్రి రాక సందర్భంగా పెర్కిట్‌లోని కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఫొటోలు పెట్టక పోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి లోనయ్యాయి. అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కల్పించుకోవడంతో వివాదం మొదలైంది. ఫ్లెక్సీని చించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా, అధికార పార్టీ నేతలు అడ్డుకన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఘర్షణ జరిగి ఉద్రిక్తత తలెత్తింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గొడవ జరుగుతుండగానే బీజేపీ శ్రేణులు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఫొటోలు లేని ప్లెక్సీలను చించి వేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి రెండు పార్టీల నాయకులను సముదాయించి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు, ప్రొటోకాల్ పాటించని అధికారులపై ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.