లింగంపేట, ఏప్రిల్14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆ మహానుభావుడి చెంతనే పోలీసులు దళితులపై దౌర్జన్యానికి దిగారు. ఫ్లెక్సీ తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన వారిపై క్రూరత్వం ప్రదర్శించారు. దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా, అర్ధనగ్నంగా ఉన్న వారిని వాహనాల్లో పడేసి అక్కడి నుంచి తరలించారు. సోమవారం లింగంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సాక్షిగా జరిగిన ఈ ఉదంతం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
సస్పెండ్ చేయాల్సిందే..
అంబేద్కర్ జయంతి రోజునే సీఐ దళితులపై దౌర్జన్యానికి దిగడమేంటని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోలీసు అధికారులు చెంచాలుగా మారి, బలి అవుతున్నారన్నారు. బీఆర్ఎస్ హ యాంలో ఎలాంటి వేధింపులు ఉండేవి కావని తెలిపారు. దళితుల పట్ల దురుసుగా వ్యవహరించిన సీఐ రవీం దర్నాయక్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయా లని, సాయిలుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే జాజాల, దళిత నేతలకు డీఎస్పీ సర్దిచెప్ప డంతో ఆందోళన విరమించారు. అరెస్టు చేసిన వారందరినీ విడిచి పెట్టాలని జాజాల కోరగా, పోలీసులు వారిని వదిలి పెట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎంపీపీ సాయిలు మనస్తాపంతో రోదించగా, జాజాల ఓదార్చారు. అందరూ కలిసి అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సాయిలు, దళిత సంఘాల నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎల్లారెడ్డి సీఐపై ఫిర్యాదు చేశారు.
ఫ్లెక్సీ తొలగించడంతోనే..
అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు నీరడి సంగమేశ్వర్.. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఫొటోతో ఫ్లెక్సీ ముద్రించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే ఫొటో ఉన్న ఆ ఫ్లెక్సీని తొలగించాలని జీపీ కార్యదర్శి శ్రవణ్‌కుమార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ వచ్చి పంచాయతీ సిబ్బందిని పురమాయించి ఫ్లెక్సీని తొలగించారు. అయితే, దీనిపై దళిత సంఘాల నాయకులు ప్రశ్నించగా, సీఐ వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో దళిత సంఘం నాయకులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
లాగిపడేసిన పోలీసులు..
రాస్తారోకో చేస్తున్న వారిపై పోలీసులు దారుణంగా ప్రవర్తిం చారు. అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, ధ్యామని భూపతి, ఆశయ్య తదితరులను పక్కకు లాగిపడేశారు. ఈ క్రమంలో సాయిలు ప్యాంటు ఊడి పోయినా పట్టించుకోకుండా అలాగే లాక్కెళ్లి వాహనంలో పడేశారు. మిగతా వారిని కూడా బలవంతంగా లాక్కెళ్లారు. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నేతలు లింగంపేటకు తరలి వచ్చారు. దళిత సం ఘాల ఆందోళనకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. క్షమాపణలు చెప్పడంతో పాటు సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ 5 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, కామారెడ్డి సీఐ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పక్కమం డలాలకు చెందిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా?
దళితులపై దాడిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
అంబేద్కర్ జయంతి రోజున దళితులపై దాడి చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో దళితులపైన పోలీసులు ప్రదర్శించిన కర్కశత్వంపై ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అంబేద్కర్ జయంతి రోజున దాడి చేయడం ఊహకందని క్రూరత్వమని పేర్కొన్నారు. రాహూల్‌గాంధీ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవీక రాజ్యమా? అని నిలదీశారు. సంఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెన్షన్ వేటు వేయాలని కవిత డిమాండ్ చేశారు.