కామారెడ్డి, అక్టోబర్ 4: నెలరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు పరిధిలో ఉన్న రామేశ్వర్‌పల్లి డబుల్ బెడ్రూం కాలనీకి నెల రోజులుగా నీరు సరఫరా కావడం లేదు. తమ గోడును నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదని విసిగిపోయిన కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు.
సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రంజిత్ అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు.తాము వ్యవసాయ బోరు బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై ఈ విషయాన్ని మిషన్ మున్సిపల్ డీఈ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఈ హన్మంత్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకారులతో మాట్లాడారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బోరు మోటరు ఏర్పాటు చేసి నీరు సరఫరా అయ్యేలా చూస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.