ఖలీల్‌వాడి/కోటగిరి, మే 16: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఎం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం, కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. ఆటో, ఆటోట్రాలీకి తాడుకట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల సందర్భంగా దేశం లో పెట్రోల్, డీజిల్ ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చారని తెలిపారు.
అంతకుముందు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో మన దగ్గర సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలున్నాయని చెప్పారని గుర్తుచేశారు. ఓట్లు అయిపోయిన అనంతరం మోదీ ప్రభుత్వం ప్రపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం మూలంగా క్రూడ్ ఆయిల్ యజమానులు, పెట్టుబడిదారులకు తలొగ్గి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడానికి నిర్ణయించిందని మండిపడ్డారు. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3.20 రూపాయల అదనపు భారం పడిందన్నారు. పెట్రో ధరల పెంపుతో నిత్యావసర సరుకుల ధర మరింత పెరుగుతుందన్నారు. ప్రజలపై భారాలు వేయడంతో వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. కార్యక్రమంలో పెద్ది వెంకట్రాములు, నర్సయ్య, అనసూయమ్మ, అనిత, అంజయ్య, నారాయణ, ఉద్దవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Nizanabad
పెట్రోల్, డీజీల్‌పై జీఎస్టీ తగ్గించాలి
కోటగిరిలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. పెట్రో ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలు, సామాన్యులు, చిరు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై జీఎస్టీ తెచ్చిందని మండిపడ్డారు. జీఎస్టీ ఎత్తివేస్తే ధరలు తగ్గుతాయని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరలను తగ్గించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి విఠల్‌గౌడ్, నాయకులు నల్ల గంగాధర్, రాజు, రాములు, నీలి శంకర్, హన్మాండ్లు, అన్సార్ తదితరులు పాల్గొన్నారు.