శక్కర్‌నగర్, జూన్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తవుతున్నా పింఛన్ల పెంపుపై నోరుమెదపడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా స్పందించి దివ్యాంగులకు రూ.6,016, వృద్ధులకు రూ.4,016 పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. పింఛన్ల కోసం నిర్వహిస్తున్న ముఖ గుర్తింపును లబ్ధిదారుల ఇంటివద్దే చేపట్టాలని, నూతన పింఛన్లు వెంటనే అందించాలని, ఇంటి నిర్మాణం కోసం దివ్యాంగులకు రూ.5లక్షలు అందించాలని డిమాండ్ చేశారు.
స్థలాలు లేని వారికి స్థలాలు ఇవ్వాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి వెంకటేశ్‌కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు షేక్ నజీర్, గాండ్ల రాజు, రహీముద్దీన్, లకన్‌సింగ్, సిరిగిరి దేవదాస్, గంగన్ పర్వయ్య, ఆవుల సాయిలు, సావిత్రి, రజిత, కరుణ, అనూషాబాయ్ తదితరులు పాల్గొన్నారు.