నిజామాబాద్ (ఖలీల్వాడి) : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ( Budget ) ను వ్యతిరేకిస్తూ బుధవారం నిజామాబాద్లో వామపక్షాల పార్టీలు (Left parties ) నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ధర్నాచౌక్లో నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్( Sudhakar) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు, కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉందని ఆరోపించారు.
జీఎస్టీ చెల్లిస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, వ్యవసాయ రైతాంగానికి, నిరుద్యోగులకు బడ్జెట్లో నామమాత్ర కేటాయింపులే ఉన్నాయని అన్నారు. బోధన్- బీదర్ రైల్వే మార్గం ఊసే లేదని, ఈ మధ్యకాలంలో ప్రకటించిన పసుపు బోర్డుకు (Haldi Board) నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ఇకనైనా బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖాజా, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగాధర్ మాట్లాడారు. దేశంలో రోజు, రోజు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడం కోసం బడ్జెట్ రూపొందించలేదని ఆరోపించారు.
బడ్జెట్లో తెలంగాణ విభజన హామీ కేటాయింపులు లేవని, జాతీయ గ్రామీణ ఉపాధి పనులను సంవత్సరానికి 200 రోజులకు పెంచుతూ, కూలిని రూ.600 లు చెల్లించే విధంగా బడ్జెట్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు అడ్డికే రాజేశ్వర్, కే రాజయ్య, సీపీఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్, వెంకన్న, సాయన్న, గంగాధర్ , వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.