కొన్ని పెద్ద హోటళ్లు గలీజు పనులకు అడ్డాగా మారాయి. పేరొందిన లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రబిందువయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు, ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు శివార్లలో ఉన్న స్టార్ హోటళ్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వ్యభిచారం, పేకాట కేంద్రాలకు అవి చిరునామాగా మారాయనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు చేసి పేకాట శిబిరాలు, వ్యభిచార ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో నిఘా లేకపోవడంతో మళ్లీ షరా‘మామూలే’ అన్నట్లుగా అక్రమాలు కొనసాగుతున్నాయి.
-వినాయక్‌నగర్, సెప్టెంబర్ 12
నిజామాబాద్‌లో పేరొందిన స్టార్ హోటళ్లు పేకాట కేంద్రాలుగా మారాయి. కొంత మంది స్నేహితులు కలిసి హోటల్ గదిని అద్దెకు తీసుకుని రోజంతా పేకాడుతున్నారు. దానికి తోడు మందు, మాంసం గదికి తెప్పించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరేమో గదులను రోజుల తరబడి అద్దెకు తీసుకుని పేకాటరాయుళ్లను పిలిచి పత్తాలు ఆడిస్తున్నారు.
గతంలో ఒకటి, రెండుసార్లు పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిగాయి. కానీ కఠిన చర్యలు చేపట్టక పోవడంతో పరిస్థితి ఎప్పటిలానే మారింది. ఏయే హోటళ్లలో పేకాట జోరుగా నడుస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. కానీ ఫిర్యాదు వస్తేనే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు తప్పితే అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, బడా హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించని పోలీసులు.. ఏదో మొక్కుబడిగా చిన్న హోటళ్లపై పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు, లాడ్జీల్లో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతున్నది. ఎక్కడెక్కడి నుంచో మహిళలను తీసుకొచ్చి ఇక్కడి లాడ్జీల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. వాట్సప్‌లో అమ్మాయిల ఫొటోలను పంపిస్తూ, ఫలానా హోటల్‌కు రావాలని విటులను పిలిపిస్తున్నారు.
తాజాగా డిచ్పల్లి శివారులోని హోటల్లో ఇలాగే వ్యభిచారం చేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అయితే, ఫిర్యాదులు వస్తేనే లేదా ఇన్ఫర్మేషన్ ఉంటేనే రంగంలోకి పోలీసులు దిగుతున్నారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా నిమిషాల్లో తెలుసుకునే వ్యవస్థ కలిగిన పోలీసులు.. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం లేదని చెబుతుండడంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
బడా హోటళ్లలో తనిఖీలు చేస్తున్నాం. పేకాట, వ్యభిచారం లాంటి కార్యకలాపాలు సాగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా దాడులు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారై నా వదిలే ప్రసక్తి లేదు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.
– రాజావెంకటరెడ్డి, ఏసీపీ