డిచ్పల్లి, అక్టోబర్ 21: తెలంగాణ యూనివర్సిటీని ప్రధానంగా పరిశోధన, బోధన రంగాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని నూతన వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు పేర్కొన్నారు. టీయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని డిగ్రీ, పీజీ కళాశాలలను టీయూ పరిధిలోకి తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.
వర్సిటీ విద్యార్థుల కోసం సెల్ప్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని, ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో వర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.వీలైనంత త్వరలో వర్సిటీ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. బాలికల వసతి గృహ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.వర్సిటీ భూముల అన్యాక్రాంతంపై కలెక్టర్‌ను సంప్రదిస్తామన్నారు.
టీయూ నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి రావుకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, అన్ని విభాగాల బోధన, బోధనేతర సిబ్బంది ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. టీయూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వర్సిటీ అధ్యాపకులతో వీసీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పరిపాలనా భవనంలోని వివిధ విభాగాలను వీసీ సందర్శించారు.