బోధన్/భీమ్‌గల్, ఫిబ్రవరి 17: కొత్తగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం సవాల్‌గా మారింది. బోధన్, భీమ్‌గల్ పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. బోధన్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు కంపుకొడుతున్నాయి. అనేక వార్డుల్లో తాగునీటి సమస్యల నెలకొన్నది. విలీన గ్రామాలు, శివారు పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. ఏడాదికాలంగా బోధన్ మున్సిపాలిటీలో పాలన గాడి తప్పింది. మౌలిక సదుపాయాలను కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. మరోపక్క పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపడుతున్నా, పట్టణ ప్రణాళికశాఖ అడ్డుకోలేకపోతున్నది. పట్టణంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా, పనులు ప్రారంభంకాకపోవటంతో పట్టణం అభివృద్ధికి నోచుకోవడంలేదు. మరోపక్క పారిశుద్ధ్య నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టడంలేదు. ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య కొత్త పాలకవర్గం బోధన్ మున్సిపాలిటీలో పాలనా పగ్గాలు చేపట్టింది.
బోధన్ పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండగా, పాత బోధన్, శివారు కాలనీలకు తాగునీరు అందడంలేదు. తరచుగా తాగునీటి పైప్లైన్లు పగిలిపోతున్నాయి. తాగునీటి లీకేజీలను అరికట్టడం మున్సిపాలిటీకి సమస్యగా మారింది. ఈ దశలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ‘అమృత్ 2.0’ పథకం కింద పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఈ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. వచ్చే వేసవినాటికి తాగునీటి పైప్లైన్ల ఏర్పాటు పూర్తిచేయాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉంది.
బోధన్ మున్సిపాలిటీలో పదేండ్ల క్రితం చుట్టుపక్కల ఉన్న ఆచన్‌పల్లి, పాండుఫారం, శ్రీనివాస్‌నగర్, నర్సాపూర్, చెక్కిక్యాంప్ గ్రామాలు విలీనమయ్యాయి. అక్కడి ప్రజలపై పన్నుల భారం పెరిగిందే తప్ప, అందుకు తగిన అభివృద్ధి పనులు చేపట్టడంలేదు. ముఖ్యంగా పట్టణ శివారులోని ఆటోనగర్, ఇందిరమ్మ కాలనీలు కనీసం రోడ్లు, డ్రైనేజీలకు నోచుకోవడంలేదు.
బోధన్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. ఇంటింటికీ చెత్త సేకరణ రోజు విడిచి రోజు జరుగుతున్నప్పటికీ, ఈ సేకరణ సక్రమంగా జరగడంలేదు. పారిశుధ్య కార్మికుల కొరత, సరిపడా చెత్త వాహనాలు లేకపోవడం ఇందుకు కారణం. పెద్ద రోడ్లను శుభ్రపరిచే స్వీపింగ్ మెషిన్ నిరూపయోగంగా ఉంది. బోధన్ పట్టణ అభివృద్ధి కోసం నిధులను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉన్నది.
భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ కొత్త పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వార్డుల్లో దుర్గంధం వ్యాపిస్తున్నది. నీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా లేదు. మిషన్ భగీరథ పైప్లైన్లు సరైన నిర్వహణలేక తరచూ లీకేజీలు అవుతున్నాయి. చెత్త వాహనాలు మరమ్మతులు లేక మూలన పడ్డాయి. వార్డుల్లో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. పట్టణంలో దోమల బెడద తీవ్రంగా ఉంది. ఫాగింగ్ జాడనే లేదు. గడిచిన ఏడాది కాలంలో అభివృద్ధి మాట దేవుడెరుగు, కనీసం అక్కడి పుల్ల తీసి ఇక్కడ పెట్టిన దాఖాలలు లేవు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రజలను ప్రభావితం చేసే ఎన్నో హామీలు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 30 కోట్లు మంజూరు చేసి ప్రారంభించిన వంద పడకల దవాఖాన పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. మిగితా 20 శాతం పనులు నిధులు లేక రెండేండ్లుగా నిలిచిపోయాయి. మూడు నెలల్లో రూ. 5 కోట్లు విడుదల చేసి దవాఖానను ప్రారంభిస్తామని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. ఎంతవరకు మాట మీద నిలబడతారో చూడాలి. ఇక భీమ్‌గల్ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేక మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని, తాను పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రూ. 360 కోట్లతో వేములవాడ నుంచి లింబాద్రి గుట్ట మీదుగా బాసర వరకు నాలుగు లేన్ల రహదారిని నిర్మిస్తున్నానని, ఇందుకోసం ప్రత్యేకంగా టెంపుల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన మాటలను ప్రజలు గట్టిగా విశ్వసించారు. అయితే ఇది ఎంత వరకు ఆచరణలో సాధ్యపడుతుందన్నది భవిష్యత్తులో తెలియనున్నది.
భీమ్‌గల్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానా లు సాధించడంతోనే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. క్యాంపులోనే అభ్యర్థులు గ్రూపు రాజకీయాలకు తెరలేపారు. గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్ పదవి కోసం పట్టుబట్టారు. చివరికి నానా కష్టాలు పడి పదవుల పంపకం చేసి ప్రమాణస్వీకారానికి ఒప్పించారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఇద్దరిద్దరు చొప్పున నలుగురు కౌన్సిలర్లుతలో సగం కాలం పంచుకునేలా తీర్మా నం చేశారు. కానీ మూడేండ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా, అప్పుడు ఈ నేతలు మాటల మీద నిలబడతారా అనేది కాలమే నిర్ణయించాలి.