బీబీపేట్, జూలై 13 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీబీపేటను నూతన మండలంగా ఏర్పాటు చేసి జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. బాలుర ఉన్నత పాఠశాలలో మూడు గదులు తీసుకొని కళాశాలను ప్రారంభించారు. దోమకొండ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈ కళాశాల బాధ్యతలను అప్పగించారు. గతేడాది జూలై 8వ తేదీన ఏర్పడిన జూనియర్ కళాశాలలో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూప్‌లలో 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అధ్యాపకులు లేకపోవడంతో దాత సహకారంతో నలుగురు ప్రైవేట్ లెక్చరర్లను నియమించారు. కళాశాలకు మొత్తం 12 మంది లెక్చరర్లు కావాల్సి ఉంది. కానీ.. నలుగురు ప్రైవేట్ లెక్చరర్లతో 45 మంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడంతో విద్యార్థులు శ్రద్ధ పెట్టకపోవడంతో 45 మందిలో ఒక్కరూ కూడా పాస్ కాలేదు.
పూర్తిస్థాయి లెక్చరర్లను నియమించాలి
ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని కళాశాలలో పూర్తిస్థాయి లెక్చరర్లను నియమించి కళాశాలను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాల సాధన సమితి సభ్యులు, నాయకులు, గ్రామస్తులు కోరుతున్నారు. లెక్చరర్లు లేకపోవడంతో కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ చొరవ తీసుకొని కళాశాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
అడ్మిషన్లు స్వీకరిస్తున్నాం
ఇంటర్లో ప్రవేశానికి అడ్మిషన్లు స్వీకరిస్తున్నాం. పాఠాలు బోధించేందుకు లెక్చరర్లు అవసరమని పైఅధికారులకు నివేదిక అందించాం. లెక్చరర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల కోసం పుస్తకాలు కూడా కళాశాలకు చేరాయి.
– షేక్ సలామ్, ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి