నవీపేట, జనవరి 23: మండలంలోని కమలాపూర్ శివారులో గురువారం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఏఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నవీపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు నారాయణపూర్ గ్రామానికి చెందిన 30 మంది విద్యార్థులను గురువారం ఉదయం ఎక్కించుకొని స్కూల్‌కు వెళ్తున్నది. క్లీనర్ భోజన్న బస్సును నడిపాడు. కమలాపూర్ శివారులోని అంకాలమ్మ, పోలేరమ్మ ఆలయం వద్ద బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో విద్యార్థులు మీనాక్షి, నయాన్షికి స్పల్ప గాయాలయ్యాయి. మిగతా 28 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలను నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎంవీఐ కిరణ్‌కుమార్, ఆర్టీవో ఉమమహేశ్వర్‌రావు వివరాలను సేకరించారు.