కంటేశ్వర్ (నిజామాబాద్) : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల(Election) నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi ) సూచించారు.
నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్, బోధన్ డివిజన్ ఆర్వో, సహాయ ఆర్వోల సమావేశాన్ని బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం వేర్వేరుగా మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ (Panchayat Elections) ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు (Returning Officers) క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్వోలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుంచే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవాలన్నారు.
బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని పేరును అక్షరక్రమం కోసం పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు.
ఈ శిక్షణ తరగతుల్లో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, డీఎల్పీవోలు, ఆర్వోలు, సహాయ ఆర్వోలు పాల్గొన్నారు.