వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 20: రాష్ట్రంలో వానాకాలం సాగకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షం పడలేదని రెండు ఆపైగా వర్షాలు కురిసిన చోట మెట్ట పంటలు సాగు చేసుకోవచ్చని, దిగులు చెందాల్సిన అవసరం లేదని, వచ్చే నెల మొదటి వారం వరకు సాగు చేసుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన విత్తన విభాగం హెడ్ సీనియర్ శాస్తవ్రేత్త జి నగేశ్ అన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పడకపోవడంతో రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే నెల మొదటి వారం వరకు మెట్ట పంట లు సాగు చేసుకోవచ్చని సూచించారు .
విత్తన ఎంపిక, పొలం చదును చేయడం, నేలను వీలైనంతవరకు లోతుగా దున్నడం వంటి పనులు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. మెట్ట పంటలో ప్రధానంగా పత్తి కి బదులుగా మక్కజొన్న, జొన్న ,ఆముదము, వేరుసెనగ ,కంది తదితర పంటలను సాగు చేసి అధిక దిగుబడులు, మంచి లాభాలు ఆర్జించవచ్చని సూచించారు. మేలైన రకాలను ఎంపిక చేసుకొని వ్యవసాయ శాస్తవ్రేత్తలు, అధికారులను సంప్రదించి సాగు చేయాలన్నారు. వీలైనంతవరకు గుర్తింపు ఉన్న విత్తనాలు, సేంద్రియ ఎరువులను వాడాలని ఆయన సూ చించారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే రసాయన ఎరువులు వాడాలని తెలిపారు. సేం ద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలకు అధిక డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.
మన రాష్ట్రం లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన నాణ్యత గల విత్తనాలను, ప్రధానంగా మక్కజొన్నలో డీ హెచ్ఎం 117, డీహెచ్ఎం 121, కరీంనగర్ మక్కా -1, కరీంనగర్ మక్కా తో పాటు గుర్తించబడిన వాటిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. కందిలో డబ్ల్యూ ఆర్ జీ ఈ 97 ,(వరంగల్ కంది 1) డబ్ల్యూ ఆర్ జీ ఈ- 93 (తెలంగాణ కంది ), డబ్ల్యూ ఆర్ జీ ఈ 121 (తెలంగాణ కంది 2) టీడీఆర్జీ 4,( హనుమ) డబ్ల్యూ ఆర్జీ 65,( రుద్రేశ్వర) పీఆర్జీ 176, ఉజ్వల ఐసీపీ హెచ్ 27 40 (మన్నెంకొండ కంది), టీడీఆర్జీ 272 (తెలంగాణ కంది 4) ,డబ్ల్యూ ఆర్జీఈ 255, టీడీఆర్జీ 59 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మన నేలల్లో 19-19-19 ఫర్టిలైజర్ వాడకం మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు.