మోర్తాడ్, ఆగస్టు13: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను గతనెల 26న జారీ చేసింది. జిల్లాలో మొదటి విడుతగా 48 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనుండగా.. ఇందుకు సంబంధించిన వివరాలను మండల విద్యాధికారులకు ఇప్పటికే పంపించారు. విద్యార్థులను ఈ విద్యాసంవత్సరం చేర్చుకోవడంతో వచ్చే విద్యాసంవత్సరం ప్రీప్రైమరీలో ఉన్న వారిని ఒకటో తరగతిలోకి పంపించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రీప్రైమరీ విద్యను పక్కాగా అమలుచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రీప్రైమరీ విద్యను బోధించేందుకు ఒక ఇన్స్ట్రక్టర్, పిల్లలను చూసుకోవడానికి ఒక ఆయాను నియమించనుండగా.. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటర్ పూర్తయి ఉండి, పాఠశాల ఉన్న హ్యాబిటేషన్ వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు, ఏడో తరగతి చదివిన వారు ఆయాగా అర్హురాలుగా నిర్ణయించారు. ఇందుకోసం స్వీకరించిన దరఖాస్తులు జిల్లా అధికారులు పరిశీలించి, నియామకాలు చేపట్టనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8వేలు, ఆయాకు రూ.6వేల వేతనం అందజేస్తారు.
ప్రీప్రైమరీలో చేరే పిల్లలు నాలుగేండ్లు నిండిన వారై ఉండాలి. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలను ప్రీప్రైమరీకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇన్స్ట్రక్టర్ ప్రీప్రైమరీకి పిల్లలను గుర్తించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో చేర్పించాల్సి ఉంటుంది. ప్రీ ప్రైమరీ కోసం పాఠశాలలోనే ఒక గదిని కేటాయించి, గదిని ఆహ్లాదం పంచేలా అందం గా అలంకరించనున్నారు. గోడలను అక్షరాలు, బొమ్మలతో చిన్నారులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దనున్నారు. ప్రీప్రైమరీ విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రం నుంచి స్నాక్స్ అందించాలని, పాఠశాల నుంచి మధ్యాహ్నభోజనం అందించాలని నిర్ణయించారు. ప్రీప్రైమరీ విద్య , విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తదితర కార్యక్రమాల నిర్వహణ విద్యా, వైద్యశాఖలు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. ఆరోగ్యపరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయాలపై సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.