మోర్తాడ్, ఆగస్టు 8: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టుకుని ఇప్పుడు రోజుకో డ్రామా పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ నిండా మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. బీసీ బిల్లు, కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల ను వేముల ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్‌రెడ్డివి ఉత్తమాటలే అని బీసీలపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది ప్రజలకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అని బుకాయించి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కేంద్ర నాయకులను రాష్ర్టానికి రప్పించి దొంగహామీలు ఇచ్చిందెవరని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానమని, బీసీ బిల్లు అని ఒకసారి, ఆర్డినెన్స్ అని మరోసారి ఇ లా చివరగా బీసీలను నమ్మించడానికి ఢిల్లీలో ధర్నా పేరిట మరో డ్రామాకు కాంగ్రెస్ తెరలేపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తీరా బీసీ రిజర్వేషన్ అమలు కేంద్రం, ప్రధానిపైకి తోసి రేవంత్‌రెడ్డి కాడి ఎత్తేశాడని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో ధర్నాకు కూతవేటు దూరంలో ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చేతగాని తనం బయటపడే సరికి బీఆర్ఎస్ వాళ్లు ధర్నాకు రాలేదని తలాతోక లేని విమర్శలు పార్టీపై చేస్తున్నాడని విమర్శించారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం అంటున్న రేవంత్‌రెడ్డి అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపుతావా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఎప్పుడు.! బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేది ఎప్పుడని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను బీసీలను మభ్యపెట్టడానికే తెచ్చారన్నది ప్రజలకు అర్థమైందని తెలిపారు. ప్రస్తుతం దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని గ్రహించి, రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీసీలను కోరారు. రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకుండా, పాలనను గాలికొదిలేసి గాలిమాటలతో పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా గాలిమాటలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేసే పనిలో ఉండాలని సూచించారు.