కంఠేశ్వర్, జనవరి 5: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రాధాన్యతనివ్వాలని, జిల్లా అధికారులకే స్వయంగా ఇందులో పాల్గొనాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్‌లతో కలిసి ఆమె ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 70 వినతులు రాగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు సిఫారసు చేశారు.
వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫాం 6, 7 పరిష్కారంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, హౌసింగ్ పీడీ పవన్‌కుమార్, ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి.. జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి, సీపీ సాయిచైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా స్థితిగతులపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ఈ సందర్భంగా కొద్దిసేపు చర్చించారు.