నవీపేట,జూలై 26 : ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉండే పల్లె.. అద్భుతంగా మారింది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్నా అభివృద్ధిలో ఆమడ దూరంగా ఉండేది. సమైక్య పాలనలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కోరినా పట్టించుకోలేదు. స్వరాష్ట్ర సాధన అనంతరం సీఎంగా కేసీఆర్ అయిన తర్వాత ఈ గ్రామ రూపురేఖలు మారాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ ఊరి కోడలు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచింది. 2014లో ఎంపీగా విజయం సాధించిన కవిత అత్తగారి ఊరిపై మమకారంతో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ప్రైవేటు కంపెనీ సన్ నెట్వర్క్ ద్వారా రూ.1.50కోట్లతో గ్రామాభివృద్ధికి బాటలు వేశారు. తొమ్మిదేండ్ల కాలంలో ఎమ్మెల్సీ కవిత చొరవతో స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌తోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు సహకారంతో ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నది. గ్రామంలో ఏ వీధి చూసినా అద్దంలా మెరిసే సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు, పాఠశాల భవనాలు, దేవాలయాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా.. అన్నింటా జిగేల్మంటున్న పోతంగల్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక కథనం…
గ్రామ సమీపంలోని చెరువు గట్టుపై ఎమ్మెల్యే కవిత ప్రత్యేక చొరవతో బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఏటా బతుకమ్మ పండుగ సమయంలో బతుకమ్మలను చెరువులో నిమిజ్జనం చేసేందుకు మహిళలు ఇబ్బందులు పడేవారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో మహిళల ఇబ్బందులను కండ్లారా చూసిన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధతో చెరువు వరకు సీసీ రోడ్డు వేయించి, బతుకమ్మ ఘాట్‌ను నిర్మించారు.
పోతంగల్ గ్రామంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించడంతో ఎక్కడకూడా మట్టి రోడ్లు కనిపించడం లేదు. సమైక్య పాలనలో చిన్నపాటి వర్షాలకే మట్టిరోడ్లు చిత్తడిగా మారి నడవడానికి వీలు లేకుండా ప్రజలు ఇబ్బందిపడే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రూ.5కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి.ఆరు నెలల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతోపాటు ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కృషితో రూ.2.35కోట్లతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తిచేశారు. గ్రామంలోని ఎకరన్నర భూమిలో ఉన్న బండరాళ్లతోపాటు గుంతలను ఎమ్మెల్సీ కవిత రూ.40లక్షలు ఖర్చు చేసి చదును చేశారు. ప్రస్తుతం ఆ భూమిలో అర్హులైన 30మందికి ఇండ్ల స్థలాల పట్టాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకుడు ఆర్.రాంకిషన్‌రావు కృషిచేస్తున్నారు.
గ్రామీణ యువత, విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందేలా పోతంగల్లో గ్రంథాలయాన్ని నిర్మించారు. ఈ గ్రంథాలయంలో విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. పాఠశాల పక్కనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామంలో లక్షల రూపాయల వ్యయంతో లైబ్రరీని ఏర్పాటు చేస్తుండడంపై గ్రామ యువకులు, విద్యార్థులు, విద్యావంతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
గ్రామంలో వివాహం చేసేందుకు కల్యాణమండపాలకు అధిక ధరను చెల్లించాల్సిన పరిస్థితి. పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఇంటి వద్దే వివాహాలు చేసేవారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో గ్రామంలో రూ.1.33 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ గ్రామస్తులకు సౌకర్యంగా మారింది. నామమాత్రపు చార్జీలతో ఈ కల్యాణ మండపంలో పెండ్లి, ఇతరత్రా శుభకార్యాలను నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. నూతనంగా నిర్మించిన ఫంక్షన్హాల్లో సకల సౌకర్యాలు కల్పించారు. గ్రామస్తుల సమక్షంలో ఫంక్షన్ హాలు నిర్వహణ కమిటీ ఏర్పాటు కానున్నది. నూతనంగా ఏర్పడే కమిటీ నామినల్ ఫీజుతో ఫంక్షన్ హాల్‌ను నడుపనున్నది. త్వరలోనే ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా ఫంక్షన్‌హాల్, నూతన స్కూల్ భవనం, గ్రంథాలయ భవనాలు ప్రారంభం కానున్నాయి.
గతంలో మా ఊర్లో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేకపోయేవి. సమైక్య పాలనలో మా గ్రామాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. తెలంగాణ వచ్చినంక మా ఊరి కోడలైన ఎమ్మెల్సీ కవిత చొరవ తీసుకొని చాలా అభివృద్ధి చేసింది. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. స్కూల్, ఫంక్షన్‌హాల్, కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయించి, పనులు పూర్తయ్యేలా చూశారు. మా మహిళలకు బతుకమ్మ పండుగ సమయంలో ఇబ్బందులు లేకుండా చెరువు వద్ద బతుకమ్మ ఘాట్‌ను కట్టించారు. మా ఊరి అభివృద్ధికి కృషి చేసిన కవితకు అందరి తరఫున కృతజ్ఞతలు.
– వీణ, ఉపసర్పంచ్, పోతంగల్
పోతంగల్ గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రుణపడి ఉంటాం. తొమ్మిదేండ్లలో రూ.15 కోట్ల వ్యయంతో మా గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. అర్హులైన 36మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయగా పనులు పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రాంకిషన్‌రావు సహకారంతో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యాయి. మా గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
– టి. రవీందర్రావు, సర్పంచ్, పోతంగల్
తెలంగాణ రాక ముందు మా గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో మా ఊరు ప్రగతిపథంలో నడుస్తున్నది. రూ.90లక్షలతో నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు గ్రామంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేశాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తాం.
– సౌద శ్రీనివాస్,ఆలయ కమిటీ చైర్మన్, పోతంగల్
పోతంగల్ గ్రామంలో ఆధ్యాత్మకత వెల్లివిరిసేలా ఎమ్మెల్సీ కవిత కృషి చేస్తున్నారు. దేవాదాయశాఖ ద్వారా రూ.90లక్షలు మంజూరు చేయించి గ్రామంలో శివాలయం, హనుమాన్ మందిరాల నిర్మాణ పనులను పూర్తి చేశారు. గత నెలలో స్వయాన ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా ఆలయాన్ని వేద బ్రాహ్మణోత్తముల సమక్షంలో ప్రారంభించారు. దీంతో పోతంగల్ ప్రజలు నిత్యం దైవదర్శనం చేసుకుంటుండడంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతున్నది.