బోధన్, నవంబర్ 22 : జిల్లాలో మరో కొత్త మండలం పురుడుపోసుకుంది. కొత్త మండలంగా పొతంగల్ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. పొతంగల్ మండలం కోసం గత సెప్టెంబర్ 28 ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేస్తూ.. ఏవైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలుపాల్సిందిగా సూచించింది. ఈ ప్రక్రియ ముగియడంతో పొతంగల్ మండలాన్ని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరిట జీవో జారీ అయింది. గత నెలలో జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో ఆలూర్, డొంకేశ్వర్ మండలాలను, బోధన్ డివిజన్లో సాలూరా మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 29 నుంచి 32కు పెరగగా, తాజాగా పొతంగల్ మండలం ఏర్పాటుతో ఆ సంఖ్య 33కు చేరింది. కొత్తగా ఏర్పడిన పొతంగల్ మండలంలో కోటగిరి మండలంలోని 14 గ్రామాలను కలిపారు. పొతంగల్ మండలంలో పొతంగల్, కొడిచెర్ల, జల్లపల్లి, కల్లూర్, హంగర్గా, హెగ్డోలి, కొల్లూర్, దోమలెడ్గి, సోంపూర్, టాక్లీ, సుంకిని, కారేగాం, తిర్మలాపూర్ గ్రామాలతో పాటు జనాభా లేని హుమ్నాపూర్ రెవెన్యూ గ్రామం ఉన్నాయి. కొత్త మండలం ఏర్పాటుతో ఆ మండలం పరిధిలోని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి హర్షం
పొతంగల్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది ఉత్తర్వులతో కూడిన జీవో జారీచేయడంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి మంగళవారం హర్షం వ్యక్తంచేశారు. పొతంగల్ మండలం ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్‌కు పోచారం శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మండలం ఏర్పాటుతో తాను గతంలో ఇచ్చిన హామీ నెరవేరినట్లయ్యిందని పేర్కొన్నారు. పొతంగల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయించిన సభాపతికి డీసీసీబీ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు.