నిజామాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హస్తం పార్టీలో పదవుల పందేరానికి తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటికీ పదవుల భర్తీ పూర్తికాలేదు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న వారిలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు మునుపు జెండా మోసిన వారంతా ఆశలు పెట్టుకున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీతామై వ్యవహరించిన వారికి ప్రాధాన్యం లేకపోవడంతో బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములే గొప్ప అన్నట్లుగా ఇతర పార్టీల నుంచి అవకాశవాద రాజకీయాల కోసం వచ్చిన వారితో కాంగ్రెస్లో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోకుండా ఆర్థిక, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తుల పాత్రనే ఇప్పుడు కీలకంగా మారడంతో.. పాత తరం నాయకులంతా నిట్టూరుస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ అవసరాల రీత్యా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారే పెత్తనం చేస్తుండడంపై జెండాలు మోసిన సామాన్య కార్యకర్తలు మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిదే హవా కొనసాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు మార్కెట్ కమిటీ పాలకవర్గాలు మినహాయిస్తే మిగిలిన ఏ నామినెటెడ్ పోస్టుల భర్తీ ముందుకు సాగడం లేదు.ఎమ్మెల్యేల చొరవతో మార్కెట్ కమిటీలు భర్తీ చేసినప్పటికీ కీలకమైన స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ నేతలకు చోటు దక్కడం లేదు. ఎమెల్యే, ఎంపీ టికెట్లు ఆశించిన భంగ పడిన వారికి రాష్ట్ర స్థాయిలో పలు కార్పొరేషన్ పదవులను పీసీసీ కట్టబెట్టి వారిని చల్లబర్చింది. రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించిన నేతలను సముదాయించినప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులను సంతృప్తి పర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అవుతోంది.
ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకూ స్పష్టత లేకపోవడంపై క్యాడర్ నిరాశకు గురవుతున్నది. ఇదేం తీరు? అంటూ నిలదీస్తున్నారు. ఇంకెప్పుడు పదవుల భర్తీ చేపడుతారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట అన్నీ తామై వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలంతా నయానో భయానో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం అలాంటి పప్పులు ఉడకక పోవడంతో మిన్నకుంటున్నారు. ఎమ్మెల్యే చేతి కింద పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పదవుల కోసం కీలక నేతలను అడిగితే సాగదీసుడు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ఓ వైపు జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ కూర్పులో మార్పులు చేర్పులపై హస్తం నేతలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుపై ఆశ పడితే కనీసం పార్టీ పోస్టుతోనైనా సరిపెట్టుకోవచ్చన్న ధోరణిలో ముఖ్య నాయకులంతా తమ పలుకుబడిని ఉపయోగించుకంటూ పైరవీలు చేసుకుంటున్నారు. కానీ వారికి అడుగడుగునా ఆశాభంగమే ఎదురవుతున్నది.
పీసీసీ నేతలను తరచుగా భేటీ అవుతూ భర్తీ ప్రక్రియలో చోటు కోసం వేడుకుంటున్న వీరి గోడు వినకపోవడంపై లోలోపల నేతలంతా కుమిలి పోతున్నారు. ఆశాభంగంతో నిరాశకు గురవుతున్నారు. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల పోరుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న దరిమిలా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల్లోనూ కీలకమైన ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ పదవులపైనా చాలా మంది కన్నేశారు. ఇప్పటి నుంచే జోరుగా నమ్మకంతో నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవి రేసులో ఉన్న కీలక నేతలు ఈ పదవుల భర్తీకి అడ్డుపుల్లలు వేస్తున్నట్లు కాంగ్రెస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణ కాకముందే జిల్లాల్లో కీలకమైన పోస్టులను భర్తీ చేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నట్లుగా తెలుస్తోంది. ఉభయ జిల్లాల్లో జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకవర్గాల్లో నియామకాల ప్రక్రియలో ఎలాంటి చలనం లేకుండా పోయింది. దీనంతటికీ మంత్రివర్గ కూర్పు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాతే నామినెటెడ్ పదవుల భర్తీ ఉంటుందనేది కీలక నేతలు చెబుతుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు మండిపడుతున్నారు.