కామారెడ్డి, మే 3: పేదోడి ఫ్రిజ్‌లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్‌లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రంలో రంజన్ల కొనుగోలు ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడా చూసినా రంజన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. ఫ్రిజ్ నీటి కన్నా రంజన్ నీళ్లే మేలని నిపుణులు చెబుతున్నారు. రంజన్ల గిరాకీ కూడా విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మట్టి కుండలే శ్రేష్ఠమని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ నీళ్లు తాగడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని, రోగాలబారిన పడకుండా రంజన్లనే వాడేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కుండ నీళ్లు ఆరోగ్యానికి మంచివని ఇప్పుడు ఎక్కువగా రంజన్ నీళ్లనే తాగుతున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత తాగునీటిని రంజన్ల ద్వారానే ప్రజలకు అందిస్తున్నారు.
పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ..
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేడు పూర్వ పద్ధతుల వైపు మళ్లుతున్నారు. మట్టి రంజన్ల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు కృషిచేసిన వారమవుతాం. కుమ్మరి శాలివాహన కువృత్తుల వారికి కూడా ఉపాధి కూడా లభిస్తుంది. ప్లాస్టిక్ నివారణ సాధ్యమవుతుంది. వీటన్నింటితో ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన కుండలను వాడుతున్నారు. మట్టి పాత్రలో తయారు చేసిన ఆహార పదార్థాలతో మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యూట్రిన్లు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అల్యూమినియం, స్టీల్ పాత్రలలో వండిన వంటకాలలో మైక్రో న్యూట్రిన్లు తక్కువగా ఉంటాయి. మట్టి పాత్రకు వేడి తగలగానే మట్టిలో కంటికి కనబడని కిరణాలు వెలువడి పదార్థాలన్నీ శుద్ధిగా మారేవని, అందుకే పూర్వీకులు ఆరోగ్యపరంగా దిట్టంగా ఉండేవారని చెబుతున్నారు.
నల్లాలు బిగించి విక్రయం..
నేటితరం అభిరుచికి అనుగుణంగా కేవలం రంజన్లను మాత్రమే కాకుండా వాటికి నల్లాలను బిగించి విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు మట్టి కుండల వైపు మక్కువ చూపుతున్నారు. వీటితోపాటు సురాయిలు, వాటర్ బాటిల్,గ్లాసులు ఇతరత్ర వాటిని మట్టితో తయారుచేసి విక్రయిస్తున్నారు. రూ.50 నుంచి రూ.300 వరకు వీటిని విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ను నివారించాలనే ఉద్దేశంతోనే పాత్రలను మట్టితో తయారు చేసి అమ్ముతున్నారు.
సీజన్ మొదలయ్యింది..
వేసవి కాలం వచ్చిందంటే మాకు చేతినిండా పనులు ఉంటాయి ఇప్పటికే సీజన్ మొదలయ్యింది. నేటి తరానికి తగ్గట్టుగా రంజన్లే కాకుండా వాటికి నల్లాలను బిగిం చి అమ్ముతున్నాం. మట్టి కుక్క ర్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను తయారు చేసి అమ్ముతున్నాం.
-రమేశ్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
మంచి రాబడి వస్తుంది…
గతంలో ఫ్రిజ్‌లోని నీటిని మాత్రమే తాగేవారు. నేడు ప్రతి ఒక్కరూ మట్టి కుండలకు అలవాటు పడుతున్నారు. దీంతో మాకు కూడా మంచి రాబడి వస్తుంది. చల్లని నీటి కోసం మట్టి పాత్రలను ఎక్కువగా తీసుకెళ్తున్నారు. మట్టి కుండల్లోని నీటిని తాగడంతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
-క్రిష్ణ, కుండలు అమ్మే వ్యాపారి