భీమ్‌గల్, ఏప్రిల్ 16: భీమ్‌గల్‌లో బుధవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెక్కుతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులు వారికి వంత పాడు తూ బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీలు ఝళిపించారు. మంత్రి జూపల్లి, కలెక్టర్ సమక్షంలోనే మాజీ ప్రజాప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని చితగ్గొట్టారు. ఒక్కొక్కరిని పది మంది వరకు చుట్టుముట్టి చితగ్గొట్టారు. కిందపడేసి లాఠీలతో కుళ్లబొడిచారు. దుస్తులు లాగుతూ, బూట్ల తో తన్నుతూ వీరంగం సృష్టించారు. కాంగ్రెస్, ఖాకీల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి రాస్తారోకోకు దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేయాలని మంత్రిని కోరారు. అలాగే, నియోజకవర్గంలో నిలిచిపోయిన 21వ ప్యాకేజీ పనులు, భీమ్‌గల్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ సహా పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. అనంతరం జూపల్లి అరగంట సేపు ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ, చివర్లో తులం బంగారం ఇవ్వడానికి నిధులు లేవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని, రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వేముల లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు అల్లర్లు సృష్టించారు. ఎమ్మెల్యే వేములను దూషిస్తూ ముందుకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించే క్రమంలో తోపులాట మొదలైంది.
బాల్కొండ నియోజకవర్గంలోని సుమారు 800 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని భీమ్‌గల్‌లోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఏర్పాటు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే, ఒక్కరినే లోనికి అనుమతిస్తామని, మిగతా వారిని పంపించబోమని పోలీసులు గేటు వద్దే ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అయితే, అప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను లోపలికి అనుమతించిన విషయాన్ని ప్రశాంత్‌రెడ్డి ప్రస్తావించారు. కాంగ్రెస్ వారికి ఒక న్యాయం, మాకో న్యాయమా? అని పోలీసులను ప్రశ్నించారు. అందరినీ బయటికి పంపుతామని, ప్రోటోకాల్ ఉన్నవారు, లబ్ధిదారులనే లోనికి పంపుతామని పోలీసులు చెప్పడంతో ప్రశాంత్‌రెడ్డి లోనికి వెళ్లారు. అయితే, ఫంక్షన్హాల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఉండడంతో బీఆర్ఎస్ నాయకులు లోనికి దూసుకెళ్లారు.
అప్పటికి మంత్రి రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు డీజేలో రేవంత్‌రెడ్డి వ్యక్తిగత పాటలు, కాంగ్రెస్ పార్టీ పాటలు పెట్టారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తిరగబడ్డారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ పాటలు ఎందుకు పెడతారంటూ నిరసన తెలిపారు. దీంతో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని డీజే బంద్ చేయించారు. ఈ తరుణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల పరస్పర నినాదాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఇరువర్గాలు తోపులాటకు దిగడంతో పోలీసులు అందరినీ బయటికి పంపారు. ఇంతలో మంత్రి జూపల్లి రావడంతో ఇదే అదనుగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు లోపలకు దూరాయి. బీఆర్ఎస్ నాయకులు జూపల్లికి అడ్డువెళ్లి జై తెలంగాణ నినాదాలు చేశారు. మంత్రి జూపల్లి కలుగజేసుకుని కాంగ్రెస్ శ్రేణులు నోరెత్తవద్దని, అలాగే బీఆర్ఎస్ శ్రేణులను వారించాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని కోరడంతో సభ మొదలైంది
గందరగోళానికి కారకులైన కాంగ్రెస్ శ్రేణులను వదిలేసిన పోలీసులు.. బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. పలువురు నాయకులను ఎత్తి బయటికి విసిరేశారు. లాఠీలతో ఇష్టమొచ్చినట్లు కొట్టారు. పోలీసులదాడుల్లో 16 మంది బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. పలువురి ఒంటిపై బట్టలు చిరిగిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి జూపల్లి బందోబస్తు నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట వెళ్తున్న నియోజకవర్గ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నాయకులను కుమ్మేయండంటూ ఆదేశాలిచ్చారు. దీంతో కొందరు పోలీసులు ఇష్టమొచ్చినట్లు దాడులకు తెగబడ్డారు.
అనుచరులపై దాడి జరుగడంతో ఆవేదనకు లోనైన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కాలి నడకన ప్రధాన రహదారిపైకి వచ్చారు. పోలీసు దౌర్జన్యాన్ని నిరసిస్తూ వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేశారు. రెండు గంటలకు పైగా రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి ఆర్మూర్ ఏసీపీ వచ్చి ఘటనపై విచారణ జరిపిస్తామని, పోలీసులు ఎవరైనా అతిగా వ్యహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
మోర్తాడ్, ఏప్రిల్ 16: ఇచ్చిన హామీలపై అడిగితే పోలీసులతో చితకబాదించడాన్ని ప్రజాపాలన అంటారా? అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు , ఆర్మూ ర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారని మంత్రి జూపల్లిని అడిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమా నుషమని పేర్కొన్నారు. చట్టవ్యతిరేకంగా కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. పోలీసుల లాఠీచార్జీకి గురైన కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
హామీలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు పోలీసులతో దాడులకు తెగబడ్డారని, అందుకు బాధ్యులైన పోలీసులను వదలబోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. గాయాలపాలైన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు కావాలని అతిగా ప్రవర్తించారని, కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి తమ నేతలపై దాడులు చేయించారన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయ కుడికి అయినా దెబ్బలు తగిలాయా అని ప్రశ్నించారు. భీమ్ గల్ సీఐతో మరి కొందరు పోలీసులు వ్యక్తిగతంగా తీసుకుని తమ వారిని కొట్టారన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని, తమ రోజంటూ ఒకటొస్తుందని అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంతటి దౌర్జన్యకాండ చూడలేదన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులను స్థానిక దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.