నిజామాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో మంగళవారం జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోయినప్పటికీ అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల వైఫల్యం కారణంగా నిమజ్జన కార్యక్రమం నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ జాప్యం ఏర్పడింది. ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో నిమజ్జనానికి వినాయకులు బయల్దేరేది.
ఈసారి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత దుబ్బ ప్రాంతం నుంచి మొదలైన శోభాయాత్ర అర్ధరాత్రి 12గంటల తర్వాత ముగియడం గమనార్హం. ఆయా ఠాణాల పరిధిలో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ వినాయకుడి శోభాయాత్రను వేగంగా జరిగేలా చర్యలు తీసుకునేవారు. ఈసారి అలాంటి చొరవ ఎక్కడా కనిపించలేదు. బీజేపీకి చెందిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జెండాఊపి వెళ్లిపోయారు. అనంతరం భక్త జనుల మధ్య శోభాయాత్ర నిజామాబాద్ వీధుల గుండా ఫూలాంగ్ వినాయకుల బావి చెంతకు చేరింది.
బుధవారం ఉదయం 9గంటల వరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి, ఏసీపీ ఆఫీస్కు కూత వేటు దూరంలో పలు మండపాల్లో వినాయకుల విగ్రహాలు ఎక్కడివక్కడే కనిపించడం గమనార్హం. కొన్నిచోట్ల మండపాల నుంచి విగ్రహాలను బయటికే తీసుకురాలేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినాయక ప్రతిమల ఊరేగింపు, భారీ వాహనాలతో నగరమంతా బుధవారం కూడా కోలాహలంగా కనిపించింది. అడుగడుగునా పోలీసులు ఉన్నప్పటికీ గణేశ్ మండపాల నిర్వాహకులతో స్థానిక పోలీసుల సమన్వయం కొరవడడంతోనే నిమజ్జన ప్రక్రియలో జాప్యం జరిగినట్లుగా తెలుస్తోంది.
కామారెడ్డి, సెప్టెంబర్ 18 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.వినాయక నిమజ్జనానికి ఆలస్యం అవుతుందని, ముందుకు వెళ్లాలని బలవంతం చేయడంతో గణేశ్ మండలి నిర్వాహకులు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. విశ్వహిందూ పరిషత్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేశారు. పోలీసులు క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. సోమవారం రాత్రి వినాయకుల నిమజ్జనం ప్రారంభమై మంగళవారం సాయంత్రం పూర్తికావాల్సి ఉంది. కానీ సోమవారం రాత్రి శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభం కావడంతో రెండు రోజులపాటు కొనసాగింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వినాయకుడి శోభాయాత్రలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి పలువురు యువకులపై పోలీసుల లాఠీచార్జి, తోపులాట ఉద్రిక్తతకు తావిచ్చాయి. హిందూ సంఘాల జోక్యం, నాలుగున్నర గంటల పాటు ఆందోళనలతో కామారెడ్డి పట్టణం అట్టుడికింది. గతంలో ఎప్పుడూ జరగని ఘటన కామారెడ్డిలో వెలుగు చూడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంతంగా జరగాల్సిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో గణేశ్ మండపాల నిర్వాహకులపై దాడి చేయడంపై బజరంగ్ దళ్ వంటి సంఘాలు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పు బడుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కామారెడ్డిలో నిమజ్జన కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంటుంది. పదో రోజున వినాయకుడి శోభాయాత్ర మొదలై 11వ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఘట్టం అంగరంగవైభవంగా కొనసాగుతుంది.
ఈ విషయంపై పోలీసులకు అవగాహన ఉన్నప్పటికీ ఈసారి చేతులెత్తేసిన పరిస్థితులు కనిపించాయి. పదో రోజున చాలా చోట్ల కామారెడ్డిలో విగ్రహాలు రోడ్లపైకి ఆలస్యంగా వచ్చాయి. దీంతో నిమజ్జనంపై ప్రభావం పడి మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఏటా 11వ రోజు సాయంత్రం 4గంటల్లోపే నిమజ్జనం జరిగేది. ఈసారి గంటల కొద్దీ జాప్యం మూలంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నది.
పోలీసుల వైఫల్యం మూలంగా సామాన్య జనానికి తిప్పలతోపాటు లాఠీ దెబ్బలు తప్పలేదు. పోలీసుల సమన్వయలేమి, ముందస్తు అప్రమత్తత, సరైన ప్రణాళిక లేకపోవడమూ ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 2017లో ఎస్పీ శ్వేతారెడ్డి ఉన్నప్పుడు మండపాల నిర్వాహకులతో గొడవలు జరిగాయి. ఆ తర్వాత వారితో సమన్వయం చేసుకుంటూ పోవడంతో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. సరిగ్గా ఎనిమిదేండ్లకు కామారెడ్డి గణేశ్ నిమజ్జనంలో మరోసారి లాఠీచార్జి పరిస్థితులు చోటు చేసుకోవడంపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.