వినాయక్‌నగర్, మే 1: అవినీతికి పాల్పడిన ఓ పోలీసుపై వేటు పడింది. తోటి సిబ్బందితోపాటు స్నేహితులను మోసం చేసిన కేసులో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ సౌత్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గజానంద్ జాదవ్ జిల్లాకోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ నేరాలకు సంబంధించి ప్రాపర్టీ రిలీజ్ కేసుల్లో పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వివిధ కేసుల్లో అవినీతికి పాల్పడగా ఆరో టౌన్లో కేసులు నమోదైనట్లు తెలిసింది. చిట్టీలు వేసి తన తోటి సిబ్బంది, స్నేహితులను గ్యారెంటీలుగా పెట్టి డబ్బులు తీసుకునేవాడు. తీసుకున్న చిటీ డబ్బులు కట్టకపోగా తనకు గ్యారంటీలుగా ఉన్న తోటి సిబ్బంది, స్నేహితుల నుంచి రికవరీ చేసి వారిని మోసం చేశాడు. దీంతో పలువురు బాధితులు నాల్గో టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సదరు కానిస్టేబుల్ అవినీతి, అక్రమాల వ్యవహారం సీపీ దృష్టికి రావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు.