డిచ్పల్లి/నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 25 : జక్రాన్‌పల్లి మండలం కేంద్రం లో యువతిపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీ సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదే గ్రామానికి చెందిన తవుసుపుద్దీన్ అనే యువకుడు ఈ నెల 23 తేదీన రాత్రి ఇంటి బయట ఒంటరిగా ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లాడని.. తనను ప్రేమించడం లేదనే కక్షతో యువతి తలపై గాయపరిచాడన్నారు. యువతి మూర్ఛపోవడంతో చనిపోయిందని భావించి ఆమెను ఇంటికి కొద్ది దూరంలో వదిలేసిపారి పోయాడన్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తవుసుఫుద్దీన్పై కిడ్నాప్, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
యువతిపై జరిగిన దాడితో కోపోద్రిక్తులైన జిల్లాకు చెందిన దళిత సంఘాలు, స్థానికులు కలిసి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బాధిత యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, దళితబంధుతో పాటు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
బాధితురాలికి పరామర్శ
ప్రేమోన్మాది చేతిలో గాయపడి నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందు తున్న యువతిని కమిషనర్ సత్యనారాయణ పరామర్శించారు. యువకుడిని అదుపు లోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వర గా శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌కు సూచించారు.