నిజాంసాగర్, జూలై 29: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు కింద రెండు పంటలకు ఢోకా లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండేతో కలిసి సందర్శించారు. వరద గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను పరిశీలించారు. అనంతరం స్థానిక నాయకులు, అధికారులు, పర్యాటకులతో కలిసి వరద గేట్ల నుంచి వచ్చే తుంపర్ల వద్ద సరదాగా గడిపారు. చిన్నతనంలో తాను నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చేవాడినని గుర్తుచేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయనపై భగవంతుడి ఆశీర్వాదం ఉండడంతో రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు.
భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ జలకళను సంతరించుకున్నదని తెలిపారు. జూలైలో నిజాంసాగర్ ఆయకట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో జూన్ 21న నీటిని విడుదల చేశామని, ఆ సమయంలో ప్రాజెక్టులో 4.90 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని తెలిపారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా..కాళేశ్వరం నీరు కొండ పోచమ్మ సాగర్‌లో 9 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే 5 టీఎంసీల నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారని స్పీకర్ గుర్తుచేశారు. గత ప్రభుత్వాల హ యాంలో ఎప్పడూ కరువు ఉండేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రాజెక్టులన్నీ పూర్తికావడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో సుపరి, సుభిక్ష పాలన కొనసాగుతున్నదని అన్నారు. కౌరవుల పాలనలో కరువు ఏర్పడిందని, ప్రస్తుతం పాండవుల పరిపాలన కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
రివర్స్‌పంపింగ్ శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ఏమిటో అందరికీ తెలిసిపోయిందన్నారు. రివర్స్‌పంపింగ్ ద్వారా నీటి పరవళ్లను అందరూ చూశారని, కానీ కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆలోచన..ఈ రోజు మన కళ్లకు కనిపిస్తున్నదన్నారు. రాష్ట్రంలో వర్షాలతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమని, మానవ తప్పిదం కాదన్నారు. కొంతమంది మతిలేకుండా మాట్లాడుతూ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని స్పీకర్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటూ పలుమార్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ముఖ్యమంత్రిని కోరారని చెప్పారు. సీఎం మదిలో నిజాంసాగర్ ప్రాజెక్టును ఓసారి తిలకించి ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన పర్యాటక పనులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల నుంచి స్పీకర్ పోచారం మక్కజొన్న కంకులను తెప్పించి రుచిచూసారు. సభాపతి వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.