వర్ని, /మోస్రా (చందూర్), జూలై 18 : హైదరాబాద్‌లో చిన్న, సన్నకారు రైతుల భూములు, ఇండ్ల స్థలాలను కబ్జా చేసే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రైతుల సమస్యలు ఏం తెలుసని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ని మండలం జలాల్పూర్, మోస్రా మండల కేంద్రంలోని రైతు వేదికల్లో మంగళవారం ‘రైతేరాజు’ కార్యక్రమం ద్వారా రైతులతో సమావేశమయ్యారు.రైతులకు కేవలం మూడు గంటల విద్యుత్ చాలని విదేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్‌రెడ్డికి ఎకరా సాగుకు ఎన్ని నీళ్లు అవసరమో తెలుసా అని ప్రశ్నించారు. రైతులు తలెత్తుకు తిరిగేందుకే రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో మనకు 14వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా కేవలం 7,700 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఇచ్చారన్నారు. గత పాలకులకు విద్యుత్ ఉత్పత్తి చేసి ఎలా సరఫరా చేయా లో కూడా తెలియదని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిచ్చి 18,870 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేశారన్నారు. అన్నదాతలకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది దేశంలోని ఏకైక రాష్ట్రం మనదే అన్నారు.ప్రజలకు మంచి పనులు చేస్తుంటే కొంత మంది అక్రమార్కులు తనను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు సహజమని, వాటిని పట్టించు కోనంటూ వెల్లడించారు. సొంత అక్క భర్తను చంపిన బీజేపీ నాయకుడొకడు తనపై లుచ్చా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ సందర్భంగా రేవంత్ మనుషుల ద్వారా కబ్జాకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసిన వీడియోలను స్పీకర్ సమావేశంలో ప్రదర్శించారు.
మూడు గంటలు కాదు మూడు పంటలు
రైతులకు కేవలం మూడు గంటల విద్యుత్ చాలంటున్న కాంగ్రెస్ కన్నా మూడు పంటలకు కావాల్సిన ఉచిత విద్యుత్ అందజేస్తున్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో రైతులందరూ ముక్త కంఠంతో స్పీకర్ చదివి వినిపించిన తీర్మానాన్ని ఆ మోదించారు. వర్నిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సింగంపల్లి గంగారాం, సహకార సం ఘం అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, సర్పంచ్ అనితా వెంకాగౌడ్, ఎంపీటీసీ సావిత్రి, నాయకులు కల్లాలి గిరి, మేక వీర్రాజు సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. మోస్రాలో జడ్పీటీసీ గుత్ప విజయా భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, వైస్ ఎంపీపీ కత్తి శంకర్, తహసీల్దార్ సాయిలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, సర్పంచులు నరేందర్ రెడ్డి, విమలా లింగయ్య, భూమ య్య, సొసైటీ చైర్మన్లు సుధాకర్ రెడ్డి, గుత్ప జగన్ మోహన్ రెడ్డి, సాయాగౌడ్, రైతులు పాల్గొన్నారు.
మూడు గంటలతో ఒక మడి కూడా తడ్వది
మేము బోర్ల కిందనే పంటలు సాగు జేస్తం.. మూడు గంటల కరెంట్తోటి ఒక్క మడి కూడా తడ్వది. సీఎం కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నడు. ఏం ఫికర్ లేకుంట మంచిగ పంటలు పండిస్తున్నం. గతంల కరెంటు జేసుట్ల పంటలు ఏయాల్నంటే భయపడుతుంటిమి.
-బంజారా రెడ్డి, రైతు, సైద్పూర్
24 గంటల కరెంటు లేకపోతే కష్టమే..
మూడు గంటల కరెంటు చాలని ఏ రైతు చెప్పడు. వ్యవసాయంపై అవగాహన లేని వారే ఇలా మాట్లాడుతారు. సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు కాబట్టే పంటలకు సకాలంలో నీరు పెట్టి పండిస్తున్నాం. లేదంటే నష్టాల పాలయ్యే వాళ్లం. రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసు..
-సందు అశోక్, రైతు, జలాల్పూర్
గప్పట్ల మస్తు తిప్పల్ అయితుండె
మా తాతలు పంటలు పండిచేటప్పుడు రాత్రి చేను కాడనే పంటుండే.. గిప్పుడైతే అసుంటి బాధలు తప్పినయ్. రోజంతా కరెంటు ఇచ్చుడుతోటి పొద్దుగాల, సాయంత్రం పొలానికి పోయి వస్తున్నాం. ఇంటికాడనే ఉంటున్నాం. మూడు గంటలు కరెంటు ఇస్తే మళ్లీ అప్పటి లెక్కనే పరేషాన్ అయితది.
-లింగన్న, రైతు, చింతకుంట
చిచ్చుపెట్టెతందుకు చూస్తుండ్రు
కాంగ్రెస్‌కు సమజ్ వడ్తలేదు. పచ్చగున్న రాష్ట్రంలో చిచ్చు పెట్టనీకి చూస్తుండ్రు. మూడు గంటల కరంట్ ఎటూ సాలదు. రైతుల బాధలు ఆయనకు ఏం తెలుసు. మంచిగ జేస్తే ఓర్వలేక మతితప్పి మాట్లాడుతుండ్రు. 24 గంటలు కరెంటు ఇయ్యకపోతే మస్తు తక్లీఫ్ అయితది.
-లింగాల స్వామి, రైతు
గప్పట్ల మస్తు కష్టాలు వడ్డం..
కాంగ్రెస్ టైమ్‌ల కరెంట్ ఇయ్యకపోవుడుతోటి మస్తు కష్టాలు వడ్డాం.. రాష్ట్రం అచ్చినంక సీఎం కేసీఆర్ సార్ 24 గంటలు కరెంట్ ఇచ్చుడుతోటి రంది లేకుండా పోయింది. గిప్పుడు రేవంత్ రెడ్డి మల్లా 3 గంటలు కరెంటు సాలని చెప్పుడు ఏందీ. గిప్పుడు సంతోషంగా ఉన్నం.పచ్చని బతుకులల్ల చిచ్చుపెడుతుండ్రు.
-హన్మంత్ రెడ్డి
రైతులంతా సంతోషంగా ఉన్నారు..
కేసీఆర్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. గత పాలకులు అస్తవ్యస్థ విద్యుత్ సరఫరాతో రైతుల జీవితాలతో దోబూచులాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల బతుకులు మారాయి. ఉచిత విద్యుత్ , సాగు నీరు పుష్కలంగా అందుతుండడంతో రైతులకు రంది లేకుండా పోయింది.
-అన్నం సాయిలు, మాజీ సర్పంచ్, జలాల్పూర్