వేల్పూర్, ఫిబ్రవరి 8 : పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ పదేపదే అదే మాట మాట్లాడుతూ తెలంగాణపై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్,శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విభజన తీరుపై తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నాడని, అమరవీరుల త్యాగాలను హేళన చేస్తున్నాడని మోదీ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. విభజన సరిగా జరగలేదని అనడం వెనుక మోదీ తెలంగాణను ఎంత శత్రువుగా చూస్తున్నాడో అర్థమవుతున్నదన్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ వైఖరి మోదీ మాటల్లో స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై వారికి ఉన్న ఈర్ష్యను బయటపెట్టుకున్నారని తెలిపారు. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించుకున్న వ్యక్తే నేడు తెలంగాణ సీఎంగా ఉన్నాడని, తెలంగాణ మీద మీరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా చెల్లవన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా మీ జిమ్మిక్కులు గమనిస్తున్నారని, మీరు రెచ్చగొట్టే యువతకు కూడా మీ కుటిల బుద్ధి మెల్లమెల్లగా అర్థం అవుతున్నదన్నారు. యువత ఆలోచనే మీ పతనానికి నాంది అని అన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు మాతృ నేల మీద ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ఇక్కడి బీజేపీ నాయకులు గుజరాత్ మోదీ దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మోదీ చేత చెప్పిస్తారో…మీరు చెప్తా రో…తెలంగాణ బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విషంగక్కారు. రాష్ట్ర విభజన సరిగా జరుగలేదని, అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని పేర్కొన్నారు. పార్లమెంటులో తలుపులు మూసివేసి, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్రవిభజన చేశారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అమరుల త్యాగాన్ని, అరవై ఏండ్ల ప్రత్యేకరాష్ట్ర పోరాటాన్ని చులకన చేసేలా ఉన్న మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే పాలన సాగిస్తున్నది. నిధులు ఇవ్వకపోగా, విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. అయినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి..పార్లమెంటు సాక్షిగా నవజాత రాష్ట్రం మీద విషం కక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ అక్కసు మాటలు, అనుచిత వ్యాఖ్యలపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
– నిజామాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరిగింది. లోక్‌సభ, రాజ్యసభలో మెజార్టీ సభ్యుల మద్దతుతోనే విభజన బిల్లు పాస్ అయ్యింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ పురుడు పోసుకున్నది. 2014, జూన్ 2 నుంచి అపాయింట్మెంట్ డేగా నిర్ణయించడంతో నాటి నుంచి పరిపాలన అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం కల్పించిన హక్కు, కోట్లాది ప్రజల బలమైన కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దాదాపుగా ఎనిమిదేండ్లు కావొస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రం ఆవిర్భవించింది. ఇదంతా రాజ్యాంగ నియమ, నిబంధనల మేరకే జరిగింది. యావత్ ప్రజలు చూస్తుండగానే ఉత్కంఠ భరిత వాతావరణంలో ఏపీ పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే… ఇదంతా జరిగి ఎనిమిదేండ్లు కావస్తుండగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం తన బాధ్యతను మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడడంపై తెలంగాణ సమా జం దుమ్మెత్తి పోస్తున్నది. ప్రధాని హోదాలో ఉన్న మోదీ మంగళవారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలంటూ నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాయి.
2014లో ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి. పలు పర్యాయాలు ఆయన ఆ రాష్ర్టాన్ని పరిపాలించాడు. వాస్తవానికి ఇప్పుడున్న గుజరాత్ ఒకప్పుడు మహారాష్ట్రలో భాగం. పరిపాలన సంస్కరణలో భాగంగా మహారాష్ట్ర నుంచి గుజరాత్ విభజన కాకపోయి ఉంటే మోదీ అనే వ్యక్తి బయటికి వచ్చే వాడే కాదంటూ విసుర్లు భారీగా వినిపిస్తున్నాయి. కొత్త రాష్ట్రం తెలంగాణపై ఎగిరెగిరి పడుతున్న నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కూడా కొన్నేండ్ల క్రితం కొత్తదేననే వాస్తవాన్ని మరిచిపోయాడంటూ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో ప్రజలకు మేలు చేసే అంశాలు మాట్లాడాలి. అంతేకానీ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్న సమయంలో ఒక రాజకీయ పార్టీని దూషించే క్రమంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం బాధ్యత గల పదవిలో ఉన్న నరేంద్ర మోదీకి తగదంటూ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ బుద్ధి మార్చుకో… అంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ పదుల సార్లు రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మాడంటూ తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోస్తున్నది.
ప్రజల ముందు నోటికొచ్చిన హామీలివ్వడం… ఆ తర్వాత తప్పించుకోవడం అన్నది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇందుకు రెండు పర్యాయాలు ఈ దేశాన్ని ఏలుతున్న మోదీని చూస్తేనే అర్థమవుతున్నది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర వాటాగా రావాల్సిన నిధులను, పలు ప్రాజెక్టులను మంజూరు చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తున్నది. చట్టాన్ని అమలు చేయాల్సిన మోదీ నిర్లిప్తం గా, తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. 2014కు ముందు బీజేపీ అధికారంలో లేని సమయంలో అనేక వాగ్ధానాలు, హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక కొత్త రాష్ర్టానికి మొండి చేయి చూపిస్తున్నది. అంతే కాదు… కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే మోదీకి కంటవింపుగా కనిపించకపోవడం దురదృష్టమంటూ రాజకీయ విశ్లేషకులు సైతం అభివర్ణిస్తున్నారు. బీజేపీ ద్వంద్వ సిద్ధాంతానికి, నిరంకుశత్వానికి మోదీ మాటలు నిదర్శనమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 8: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ దిష్టిబొమ్మల దహనం చేయాలని, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ శ్రేణులను
కోరారు.
ఆర్మూర్, ఫిబ్రవరి 8 : ‘నమో’ అంటే నమ్మకద్రోహం, మోసంలా పీఎం మోదీ మారారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లునే అవమానించిన రాజ్యాంగ ద్రోహి, ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై పుట్టెడు విషం చిమ్మిన విద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. మొదటి నుంచి తెలంగాణపై వ్యతిరేకత పెంచుకున్న మోదీ మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్రలు చేస్తుండన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజాబంధు అయితే, మోదీ రాబంధులా మారిండన్నారు. మోదీ మాటలు విని రాష్ట్ర బీజేపీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా మోదీ కుట్రపూరిత వ్యక్తిత్వం బయటపడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించిన పార్లమెంట్‌ను, నోటిఫికేషన్‌పై సంతకం పెట్టిన రాష్ట్రపతిని, తెలంగాణ చిన్నమ్మ అని చెప్పుకున్న సు ష్మాస్వరాజ్ను, రాష్ట్రం ఇచ్చానన్న సోనియాగాంధీని, నాలుగు కోట్ల మంది ప్రజలను మోదీ పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారన్నారు. తెలంగాణ వచ్చి ఏడున్నరేండ్లు అయ్యిందని, అయినా మోదీ తెలంగాణ సాడే సాత్లా మారాడని ఎద్దేవా చేశారు. మోదీ శనిలా దాపురించాడన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే మోదీ తెలంగాణ ఇచ్చేవాడే కాదని, రాష్ర్టాల విభజనకు మోదీ వ్యతిరేకమని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని అన్ని పార్టీలు తీర్మానం చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వివరించారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య చిచ్చు రేపేందుకే మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్రకు తెర లేపాడనే అనుమానం కలుగుతోందని అన్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ చూసి మోదీ ఓరుస్తలేడు. గుజరాత్ కన్నా మంచి పథకాలను సీఎం కేసీఆర్ పెట్టుడుకు పరేషాన్ అవుతున్నడు. అంతా అయినంక గిప్పుడు విభజన సక్కగ జరుగలేదని అనడం చాలా బాధాకరం. తెలంగాణ కోసం నా కొడుకు ధరావత్ శ్రీను లాంటి బిడ్డలెందరో పానాలు పోగొట్టుకున్నరు. పార్లమెంటులో పనికిరాని మాటలు మాట్లాడడంతో తెలంగాణపై ప్రేమలేదని తేలిపోయింది. గుజరాత్ కన్నా అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుండడంతో మోదీ ఓర్వలేక మాట్లాడుతున్నడు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు.
ఒక ఓటు… రెండు రాష్ర్టాలు అనే నినాదాన్ని బీజేపీ సిద్ధాంతంగా పెట్టుకున్నది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో కొత్తగా మూడు రాష్ర్టాలను విభజించింది. ఇదంతా తమ స్వార్థ రాజకీయాల కోసం ఆడిన ఆట. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఏర్పాటు సమయంలోనే తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోలేదు. అంటే వారి దృష్టిలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలనే ఆలోచన లేదు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి కేసీఆర్ ఉద్యమబాట పట్టడంతో యావత్ దేశం కదిలి వచ్చింది. 2009లో ఆమరణ దీక్షతో యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసి, వెనక్కి తగ్గింది. అనంతరం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం కోసం పోరు ఉధృతం కావడంతో యూపీఏ సర్కారు ఏపీ పునర్విభజనను చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ అనివార్యంగా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపింది. ఇదంతా కేసీఆర్ వ్యూహాలు, ఉద్యమ కార్యాచరణతోనే సాధ్యమైంది. ఎన్నో ఏండ్ల కల నెరవేరగా… బంగారు తెలంగాణ దిశగా కొత్త రాష్ట్రం దూసుకుపోతున్న సందర్భంలో బీజేపీ తమ కపట నీతిని బయట పెట్టుకుంటున్నది. ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి అడ్డదిడ్డంగా, ఇష్టానుసారంగా తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేయడం ద్వారా నవ్వుల పాలవుతున్నాడు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక నరేంద్రమోదీ విషం చిమ్ముతున్నారు. తెలంగాణను మోసం చేస్తున్న బీజేపీకి ప్రజలు సరైన సందర్భంలో బుద్ధి చెబుతారు.
– పుప్పాల రవి, ఉద్యమకారుడు
తెలంగాణపై ప్రధాని మోదీ, బీజేపీ వివక్ష చూపిస్తున్నాయి. రాష్ర్టాన్ని అన్యాయంగా విడగొట్టారని మోదీ పార్లమెంట్లో మాట్లాడిన తీరుతో ఇది రుజువైంది. ఆత్మబలిదానాలు తెలంగాణ కోసం జరిగినవి కావని మోదీ చెప్తాడా? రాష్ట్రం వస్తలేదని మా బిడ్డ రజిత పానం తీసుకున్నది. ఆంధ్రోళ్లు జేయవట్టి ఉద్యోగాలు రావని, తెలంగాణ వస్తేనే మంచిదని ఇంకెంతో మంది బిడ్డలు జీవిడిసిన్రు. అచ్చిన తెలంగాణ మంచిగైతుంటె మోదీకి కండ్లు మండుతున్నయ్. ఓర్వలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు.
– తెడ్డు రాధ-గంగాధర్, అమీనాపూర్(వేల్పూర్)
తెలంగాణపై వివక్ష చూపుతూ విషంకక్కిన పీఎం మోదీ, బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది. అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడాల్సిన స్థాయి లో ఉండి ఇలా మాట్లాడడం శోచనీయం. మోదీకి దేశం, రాష్ర్టాలను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష లేదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పరిపాలన కొనసాగిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇలాంటి వారికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
– ఏనుగు సాయిలు, గన్నారం
తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకుంటే ప్రధానిగా ఉండి చిల్లరగా మాట్లాడడం సరికాదు. ఆంధ్రోళ్ల పెత్తనం కింద నలిగిపోయి, పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకుంటే తప్పుగా మాట్లాడడం మీస్థాయిని తగ్గిస్తుందనే విషయాన్ని మరువొద్దు. ప్రజలను చిన్నచూ పు చూసిన వారు గద్దెదిగక తప్పదు. మరోసారి తెలంగాణ ప్రజలను, అమరుల కుటుంబాలను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం.
– గొడుగు కాశీరాం, సర్వాపూర్, గాంధారి
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చింది. తెలంగాణకు బద్దవ్యతిరేకి మోదీ. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీజేపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీజేపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.
– సుజీత్‌సింగ్ ఠాకూర్, ఉద్యమకారుడు
సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమంతోనే స్వరాష్ట్రంలో సంతోషంగా ఉన్నాం. రాష్ట్రం కోసం నా కుమారుడు బోయిని మొగులయ్య ఆత్మహత్య చేసుకున్నడు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ నా చిన్న కొడుక్కి అటవీ శాఖలో సర్కారీ నౌకరీ ఇప్పిచ్చిండ్రు. రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపై విషం కక్కడం తగదు. ప్రాణాలకు తెగించి రాష్ట్రం సాధించుకుంటే నరేంద్రమోదీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు. వచ్చేరోజుల్లో తగిన బుద్ధి చెబుతాం.
– బోయిని నాగయ్య, హసన్‌పల్లి (అమరవీరుడి తండ్రి)
ఎంతో మంది బలిదానాలు చేసి రాష్ర్టాన్ని తెచ్చుకుంటే.. ప్రధాని నరేంద్రమోదీ ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టడానికి చూస్తున్నారు. తెలంగాణపై ఇంత కక్ష ఉందని ఇప్పుడే తెలిసింది. అందుకే రెండేండ్లుగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించలేదు.
– ఈగ గంగారెడ్డి, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు