ఆర్మూర్, ఫిబ్రవరి 27: సబ్బండ వర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శరణ్యమని పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన గౌడ సంఘాల ముఖ్య నాయకులు ప్రవీణ్‌గౌడ్, రవితేజా గౌడ్, వంశీ, మహేందర్, సురేందర్, సుదర్శన్, నర్సాగౌడ్ నాయకత్వంలో వందలాది మంది ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎదురు,బెదురు లేని నేత కేసీఆర్ అని, ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుడుతున్నదన్నారు. ప్రజలందరూ కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ గాక ఏ పార్టీ వచ్చినా రాష్ట్రంలో ఉచిత పథకాలు ఉండవన్నారు. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాలకు అందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బలమైన నేతగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలువాలని కోరారు. అభివృద్ధిలో ఆర్మూర్ నియోజకవర్గం పరుగులు తీస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పిప్రి గ్రామ సర్పంచ్ అసపురం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీటీ సురేశ్, విండో చైర్మన్ హేమంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్, చిన్న భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.