వేల్పూర్, అక్టోబర్ 15 : ‘హలో..పదిహేను రోజుల క్రితం కొనుగోలు కేంద్రంలో మీరు విక్రయించిన సోయా బాగోలేదట.. అవి పై నుంచి వాపస్ వచ్చినయ్.. వెంటనే కేంద్రానికి వచ్చి తీసుకెళ్లండి..’ అంటూ నిర్వాహ కుల నుంచి ఫోన్లు రావడంతో రైతులు కంగుతిన్నారు. కొనుగోలు కేంద్రానికి వెళ్లగా నిర్వాహకులు సోయా బస్తాలను తిరిగి ఇచ్చేయడంపై అన్నదాతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. వేల్పూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం 15 రోజుల క్రితం సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సేకరణ ప్రారంభించింది. దీంతో రైతులు తమకు మద్దతు ధర వస్తుందని సంతోష పడ్డారు. మండలంలోని మోతె గ్రామానికి చెందిన కొందరు రైతులు సోయాలను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించారు. చెన్ని పట్టించి కాంటా కూడా చేశారు. రెండురోజుల క్రితం రైతులకు కొనుగోలు కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు విక్రయించిన సోయా 60 బస్తాలు రిటర్న్ వచ్చాయి. అవి బాగోలేవట..వచ్చి తీసుకెళ్లండి..’ అంటూ కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. మంగళవారం కేంద్రానికి వెళ్లిన సదరు రైతులకు 60 బస్తాల సోయాను వాపస్ ఇవ్వగా.. చేసేదిలేక వారు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది.
మా సోయా ధాన్యంలో చెత్త ఉం దని అధికారుల వాపస్ పంపించారు. మరీ ప్రైవేట్ వ్యాపారులు ఎలా తీసుకుంటారో అధికారులు సమాధానం చెప్పాలి. గతంలో ఎన్నడూ కూడా కొనుగోలు కేంద్రం నుంచి మేము విక్రయించిన ధాన్యం వాపస్ రాలేదు. పేరుకే కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇలా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.