బోధన్/కమ్మర్పల్లి, అక్టోబర్ 3: నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఊరించి ఉసూరుమన్నట్లు సాగింది. మోదీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రధాని హోదాలో రెండోసారి ఇందూరుకు వచ్చిన మోదీ జిల్లాపై వరాలు కురిపిస్తారని అంతా భావించారు. దశాబ్దాల కల అయిన బోధన్-బీదర్ రైల్వే లైన్‌కు పచ్చజెండా ఊపుతారని ఆశించారు. అలాగే, పసుపుబోర్డు నిజామాబాద్‌లోనే ఏర్పాటు, విధివిధానాల ప్రకటన ఉంటుందని రైతులు భావించారు. కానీ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోని ప్రధాని నిధుల మూటలు ఇవ్వకుండా మాటలు చెప్పి వెళ్లిపోవడంతో జనం అవాక్కయ్యారు.
ఇందూరుకు వచ్చిన నరేంద్ర మోదీ.. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.6 వేల కోట్లతో నిర్మించిన ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ పవర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను, రూ.1200 కోట్లతో 76 కిలోమీటర్ల మేర నిర్మించిన సిద్దిపేట్-మనోహరాబాద్ కొత్త రైల్వేలైన్‌ను, రూ.305 కోట్లతో ధర్మాబాద్-మనోహరాబాద్-మహబూబ్‌నగర్-కర్నూల్ రైల్వేమార్గంలో జరిగిన విద్యుద్దీకరణ లైన్, సిద్దిపేట్-సికింద్రాబాద్ రైలును ఆయన ప్రారంభించారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాక్స్‌కు శంకుస్థాపన చేశారు. బహిరంగసభ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ.. అనంతరం బహిరంగసభ వేదికపైకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీదర్ నుంచి వచ్చి..
బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మోదీ.. ఇక్కడి మళ్లీ బీదర్‌కే బయల్దేరారు. అయితే, జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బోధన్-బీదర్ రైల్వేలైన్ విషయాన్ని ఆయన పూర్తిగా విస్మరించారు. ఒకపక్క బీదర్ నుంచి రావటం, అక్కడికి వెళ్లటమే కాకుండా నిజామాబాద్ వేదికగా ఆయన రైల్వేలకు సంబంధించిన మనోహరాబాద్-సిద్దిపేట్ కొత్త రైల్వేలైన్‌ను, రైల్వేలైన్ విద్యుద్దీకరణను జాతికి అంకితంచేయడం, సిద్దిపేట్-సికింద్రాబాద్-సికింద్రాబాద్ రైలును ప్రారంభించినప్పటికీ, జిల్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన బోధన్-బీదర్ రైల్వేలైన్ ఏర్పాటుపై స్పందించక పోవడం జిల్లా వాసులకు ఆవేదనను మిగిల్చింది. ఈప్రాంతానికి సంబంధించిన అతి ముఖ్యమైన రైల్వే ప్రాజెక్ట్‌ను విస్మరించటం నిరాశకు గురిచేసింది.
బోధన్-బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి ఉంది. చివరికి ఈ రైల్వేలైన్ సర్వే కోసం 2010 కేంద్ర రైల్వే బడ్జెట్లో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి మమతాబెనర్జీ నిధులను కేటాయించగా,ఆ 2014 నాటికే సర్వే పూర్తయింది. బోధన్ నుంచి బీదర్ వరకు సుమారు 160 కిలోమీటర్ల పొడవైన రైల్వేలైన్‌ను నస్రుల్లాబాద్, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం, నారాయణఖేడ్‌ల మీదుగా నిర్మించాలన్న ప్రతిపాదనపై జరిగిన సర్వే నివేదికను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రైల్వేలైన్ పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాలు వ్యాపారపరంగా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయి. ఇంతటి కీలకమైన రైల్వే ప్రాజెక్ట్‌పై ప్రధాని నిజామాబాద్ పర్యటన సందర్భంగా ప్రస్తావిస్తారనుకుంటే, కనీసం ఆ ఊసే ఎత్తకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. జిల్లా రైల్వేలైన్ల నిర్మాణం, అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనమని ప్రజలంతా భావిస్తున్నారు.
జక్రాన్‌పల్లి ఎయిర్పోర్ట్ ఊసే లేదు
జిల్లాలోని జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయమై ప్రధాని ప్రకటన చేస్తారనుకున్న జిల్లా ప్రజలకు మోదీ నిరాశే మిగిల్చారు. ఎయిర్పోర్ట్ విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంభిస్తూ వస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితి ఉందని పౌరవిమానయాన అధికారులు కేంద్రానికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూమిని చూపించింది. అయితే, కేంద్రం ఏదో కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తూ వచ్చింది. జక్రాన్‌పల్లికి విమానాశ్రయం వచ్చినట్లయితే, జిల్లాతో పాటు పొరుగుజిల్లాలకు, పొరుగున సరిహద్దులోని మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలకూ విమాన ప్రయాణం చేరువవుతుంది. దీంతోపాటు జిల్లా అభివృద్ధికి ఈ విమానాశ్రయం దోహదపడుతుంది. కానీ, ఈ విషయంలోనూ ప్రధాని జిల్లా వాసులను నిరాశకు గురి చేశారు.
సభకు వెళ్లకుండానే..
నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 3 : ప్రధాని సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు సభాస్థలికి వెళ్లకుండా ఉండిపోయారు. అర కిలోమీటర్ దూరంలోనే చెట్లు, వివిధ దుకాణాల సముదాయాల వద్ద సేద తీరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీజేపీ నాయకత్వం మోదీ సభకు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి జనాలను తరలించింది. అయితే మోదీ సభ వద్దకు చాలా మంది జనాలు వెళ్లకుండా హోటళ్లు, బేకరీ, చెట్ల కింద ఉండి నిరీక్షించారు. కొందరైతే అక్కడి వరకు నడుచుకుంటూ ఏం వెళుదాములే ఇక్కడే కూర్చుందామంటూ కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్ రోడ్డులో షాపుల ఎదుట కూర్చుండిపోయారు. మోడీ హిందీలో మాట్లాడితే మాకేమి అర్థమవుతదిలే అని గీడనే గూర్చుంటున్నామంటూ మహిళలు తెలిపారు. ఇక కొందరు పురుషులేమో మద్యం దుకాణాల వద్ద సేద తీరారు.
తరలి వచ్చిన మార్వాడీలు
నిజామాబాద్ స్పోర్ట్స్, అక్టోబర్ 3 : ప్రధాని మోదీకి మార్వాడీలు ఘనంగా స్వాగతం పలికారు. మోదీ తన 40 నిమిషాల ప్రసంగం మొత్తం హిందీలోనే కొనసాగింది. తర్జూమా లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు.
మోదీ.. అబద్ధాల కోరు
మోదీ వ్యాఖ్యలపై వేముల ఫైర్
ఖలీల్‌వాడీ, అక్టోబర్ 3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధాల కోరు అని, నిజామాబాద్ జిల్లాకు వచ్చి సీఎం కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిడపడ్డారు. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి అబద్ధం. ఎన్డీయేలో కలవమని మీరు బతిమిలాడితే దేశాన్ని అమ్మే వారితో కలువబోమని కేసీఆరే కరాఖండిగా చెప్పారని తెలిపారు. మోదీ చేసిన ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. ‘కేసీఆర్‌పై ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న నీవు ఇన్ని రోజులు ఏం చేశావు. దర్యాప్తు సంస్థలన్నీ నీ జేబులోనే ఉన్నాయి కదా’ అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన ప్రధాని మోదీ కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం విడ్డూరమని, ఆదానీకి బినామీ అయిన మోదీ దేశ సంపదను తన మిత్రుడికి దోచిపెడుతున్నాడని విమర్శించారు. హిండెన్‌బర్గ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు మోదీ అవినీతి చిట్టా బయటపెట్టాయి.
‘తెలంగాణ అంటేనే నరనరాన విషం నింపుకున్న మోదీ తెలంగాణ కోసం చేసింది శూన్యం. బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు, ఐటీఐఆర్, ఐఐటీలు ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి బద్ద వ్యతిరేక మోదీ. నిజామాబాద్‌లో హెలికాప్టర్ దిగిన మోదీ.. కేసీఆర్ కట్టిన కలెక్టరేట్, కేటీఆర్ కట్టిన ఐటీ టవర్ చూసి కన్ను కుట్టి ఏవేవో కహానీలు చెప్పిండు. కేటీఆర్‌ను సీఎం చేయాలంటే నీ సహాయం ఎందుకు అని మోదీని ప్రశ్నించారు. ‘నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి. నీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత. నీ బలమెంత.. వంద మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది మాకు. కేసీఆర్ అనుకుంటే ఈ ఎమ్మెల్యేల బలంతో కేటీఆర్‌ను సీఎం చేయొచ్చు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం నీ గుండెల్లో దడ పుట్టిస్తోంది. అందుకే కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలకు ఒడిగట్టావు. మీరెన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపు ఆపలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు.