ఖలీల్వాడి/కోటగిరి, ఫిబ్రవరి 27 : మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు ఫిబ్రవరి నెలలోనే భగభగమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. వారం క్రితంవరకు తీవ్ర చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత పెరుగుతున్నది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండల గురించి తలుచుకుంటేనే ప్రజల్లో ఆందోళన మొదలవుతున్నది.
గతేడాది జిల్లాలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే 37 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఆదివారం 37.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, వడగాలుల ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్న సయమంలో జనసంచారం కనిపించలేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి. పెండ్లిళ్ల సీజన్ ఉండడంతో ప్రజలు తలకు టవల్, కర్చిఫ్, టోపీలు ధరించి కనబడ్డారు. ఉదయం పది దాటితే ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల భయంతో కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు.
ఏప్రిల్, మేలో తీవ్రతరం..
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలతోపాటు రోహిణి ఎండలు తీవ్రంగా ఉంటాయని, దీంతోపాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి నరేందర్ హెచ్చరించారు. ఇప్పటివరకు ఉన్న వాతావరణం వేరు, రానున్న కాలంలో పరిస్థితులు వేరుగా ఉంటాయని తెలిపారు. దినసరి కూలీలు ఉదయంపూటనే పనులు పూర్తిచేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలంటున్నారు.
రాత్రిచలి.. మధ్యాహ్నం వేడి..
రాత్రిపూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటున్నది. ప్రతిరోజూ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వైరల్ జ్వరాలు పెరిగాయి. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఎండదెబ్బల నుంచి కాపాడుకునేందుకు ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది.
వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు