కంటేశ్వర్ ఫిబ్రవరి 16 : నిఖార్సయిన పట్టభద్రున్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పట్టభద్రులను నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్, ఓయూ విద్యార్థి నేత సుకేశ్ సూచించారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన నిజమైన పట్టభద్రుడు ప్రొఫెసర్ హరికృష్ణ అని తెలిపారు.
ఆదివారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరు కూడా డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కున్నారని తెలిపారు. వీరిద్దరికీ పట్టభద్రుల, నిరుద్యోగుల సమస్యలు పూర్తిగా తెలియవని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ అంటే మీనింగ్ తెలియని వాళ్లు కూడా పోటీలో నిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తరువాత 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మభ్యపెట్టి, 12 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అశోక్‌కుమార్, సుకేశ్ అన్నారు. 119 నియోజకవర్గాలలో ఎన్నికైన ఏ ఒక్కరూ ఎమ్మెల్యేలు నిరుద్యోగులు పక్షాన మాట్లాడలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయని, డీఎస్సీ వేస్తే ఐదు, ఆరు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఏళ్లు గడిచిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని విమర్శించారు. డబ్బులు ఉన్న వాళ్ళను గెలిపిస్తే డబ్బులు సంపాదిస్తారు తప్ప.. సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించారని తెలిపారు. విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు తెలిసిన నాయకుడు 20 ఏళ్లుగా జూనియర్ లెక్చరర్ గా పని చేసి ఉద్యోగాన్ని వదిలేసి, ఎందరో నిరుద్యోగులకు మార్గ నిర్దేశం చేస్తూ ఉద్యోగాలు సాధించేలా చేసిన ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి, విద్యా విభాగంలో ఎంతో అనుభవం కలిగి, నాలుగు ఐదు సబ్జెక్టు లను బోధించి, ఎందరో కానిస్టేబుల్, గ్రూప్ 2 అధికారులను తయరు చేసిన హరికృష్ణ ను గెలిపిస్తే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
ప్రసన్న హరికృష్ణ తో మాట్లాడే శక్తి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు లేదని.. ఒకవేళ చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎవరికీ ఎలాంటి అవగాహన ఉందో అర్థం అవుతుందని అన్నారు. మేథోశక్తి ఉన్న వారిని గెలిపించండని విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ గురించి అవగాహన ఉన్న వ్యక్తులను గెలిపిస్తే, నోటిఫికేషన్ లలో అవకతవకలు జరిగితే సమర్థులు ఉంటే పరిష్కారం చేస్తారని అవగాహన లేని వారితో సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా శక్తి మూవ్ మెంట్ రాష్ట్ర యువజన అధ్యక్షులు దేవేందర్ జాదవ్, రవినాయక్, వినోద్ నాయక్ గంగాధర్, ప్రవీణ్ రాజ్, నాగరాజు ప్రణీత్, రంజీత్ పాల్గొన్నారు.