తాడ్వాయి, ఫిబ్రవరి 19: గ్రామాల్లో మట్టి రోడ్లతో ప్రజలు నరకయాతన పడేవారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నది. దీంతో గ్రామాల్లోని మట్టి రోడ్లు అన్నీ సీసీగా మారుతున్నాయి. తాడ్వా యి మండలంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభు త్వం నిధులను మంజూరు చేసింది. ఎమ్మెల్యే జాజాల సురేందర్ సహకారంతో నిధులు మంజూరు కాగా.. పనులు చేపడుతున్నారు. వానకాలంలో రోడ్డుపై నడవాలంటేనే ప్రజలు భయపడేవారు. వాహనదారులు బైకులు, సైకిళ్లు నడపలేని పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు అభివృద్ధి బాటలో పయణిస్తున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మండలంలో ఈ ఏడాది సుమారు రూ.రెండు కోట్ల నిధులు సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి. విడుతల వారీగా గ్రామాల్లోని మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తున్నారు. మండలంలోని కాళోజివాడి తదితర గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చురుకుగా సాగుతున్నది. గ్రామాల్లోని రోడ్లు సీసీగా మారడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఏండ్లుగా రోడ్లు బాగా లేక చాలా కష్టపడ్డం. సిమెంటు రోడ్లు వేయడంతో మా బాధ తీరింది. ఆరు నెలల కింద రూ.25లక్షలతో సిమెంటు రోడ్లు వేసిండ్రు. వర్షం పడ్డా బైక్పై ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నం.
– గడ్డం ఎల్లయ్య, బ్రాహ్మణపల్లి
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నాణ్యతతో చేపడుతున్నాం. రోడ్లు వేసేటప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రోడ్డు వేసే వీధుల్లో రహదారికి ఇరువైపులా ఉన్న యజమానులు సహకరించాలి.
– రాకేశ్, పీఆర్ ఏఈ, తాడ్వాయి