పొతంగల్, నవంబర్ 20 : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తహసీల్దార్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలంలోని కొడిచర్ల శివారు నుంచి సిరిపూర్ వెళ్లే దారిలో సుమారు నెల రోజుల క్రితం చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు.
చెక్‌పోస్టు వద్ద ప్రతి రోజూ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. సోమవారం సాయంత్రం అధికారులు విధుల్లోకి వెళ్లే సరికి చెక్‌పోస్టు కాలిపోయి కనిపించింది. ఇసుక అక్రమ రవాణాకు ఆటంకం ఏర్పడుతున్నదని, ఇసుక మాఫియా దుండగులే నిప్పుపెట్టి ఉంటారేని అనుమానం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.