ధర్పల్లి/లింగంపేట, జూన్ 30 : వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ కోసం పోస్టాఫీసుల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధర్పల్లి మండలంలో మొత్తం 8,879 మంది పింఛన్‌దారులు ఉండగా, మండల కేంద్రంలోనే 2,219 మంది ఉన్నారు. ప్రతినెలా పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే వీరందరూ మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌కు రావాల్సి ఉంటుంది. పోస్టల్ సిబ్బంది గ్రామాలకు వెళ్లి పంపిణీ చేస్తుండగా, మండల కేంద్రంలో పింఛన్ తీసుకోవడానికి నానా అవస్థలు పడాల్సివస్తున్నది.
పోస్టాఫీస్ సిబ్బంది ఒకరిద్దరు పింఛన్లు పంపిణీ చేయడం, బయోమెట్రిక్ సమస్య తలెత్తుతుండడంతో రోజంతా అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తున్నదని వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు వాపోతున్నారు. సోమవారం ఉదయం పింఛన్ కోసం వచ్చిన వారు గంటలతరబడి వేచిచూసి అసహనానికి గురై పోస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పింఛన్‌దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బులు త్వరగా అందించేలా చూడాలని కోరారు.
లింగంపేట పోస్టాఫీస్ వద్ద మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సోమవారం పడిగాపులు కాశారు. కొందరు మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకోవడానికి రావడంతో బారులు తీరారు. ఎస్పీఎం డబ్బులు లేవని చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్పీఎం సూర్యకాంత్‌ను వివరణ కోరగా కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల్లోని పోస్టాఫీసులో డబ్బులు లేకపోవడంతో పింఛన్లను పంపిణీ చేయడం లేదని తెలిపారు. డబ్బులు వచ్చిన వెం టనే మూడు నెలలకు సంబంధించి పెన్షన్ డబ్బులు ఆయా పంచాయతీల కార్యదర్శులతో పంపిణీ చేయిస్తామని వెల్లడించారు.