సర్కారు చేసిన మోసంపై ఊరు గొంతెత్తింది.. పథకాల ఎగవేతపై పల్లె ఎలుగెత్తి నిలదీసింది. లబ్ధిదారుల ఎంపికలో పేదవారికి జరిగిన అన్యాయంపై ఆక్రోశం వెల్లువెత్తింది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా దక్కక గుండె మండిన సామాన్యులు తిరగబడ్డారు. అర్హులను కాదని అనర్హులను జాబితాలో చేర్చడంపై ఎక్కడికక్కడ అధికారులను నిలదీశారు. ధర్నాలు, నిరసనలు, నిలదీతలతో హోరెత్తించారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన గ్రామసభల్లో కనిపించిన దృశ్యాలివి.. సర్కారుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనాలివి..
-నమస్తే యంత్రాంగం, జనవరి22
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం నిర్వహించిన గ్రామసభలు నిలదీతలు, నిరసనలతో రసాభాసగా మారాయి. పథకాలకు అర్హులను కాకుండా అనర్హులను ఎంపిక చేయడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో బుధవారం జరిగిన గ్రామసభలు ప్రజల నిలదీతలతో తీర్మానాలు చేయకుండానే ముగించారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌లో మహిళలు ఇందిరమ్మ ఇండ్ల గురించి నిలదీశారు. భూములు, బంగ్లాలు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని, ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకున్నా తమనెందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఇండ్ల కేటాయింపులపై అంగన్వాడీ టీచర్లు సైతం నిలదీయడం గమనార్హం. మోర్తాడ్ మండలం వడ్యాట్లోనూ కార్డులు, ఇండ్ల విషయంలో అధికారులను ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు చెందిన వారి పేర్లే జాబితాల్లో ఉండడంపై అసహనం వ్యక్తంచేశారు. మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని వారు బదులివ్వడంతో ఆగ్రహించిన ప్రజలు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని నిలదీయడంతో ఎలాంటి తీర్మానాలు చేయకుండానే గ్రామసభను ముగించారు. భీమ్‌గల్ మండలం బాచన్‌పల్లిలో ఓ రైతు తనకు రైతు రుణమాఫీ కాలేదని, ముందు దాని సంగతి చూడాలని పట్టుబట్టాడు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. బడా భీమ్గల్లోనూ ఇలాగే కొనసాగింది. కేసీఆర్ ప్రభుత్వం 120 ఇండ్లు కట్టించి లబ్ధిదారులకు అందజేసిందని, అయినా గ్రామంలో ఇంకా 400 దరఖాస్తులు వచ్చాయంటే సర్వే ఎలా చేశారని మండిపడ్డారు. ఏడాదిలోనే ఇంత మందికి ఇండ్లు లేకుండా పోయా యా? అని నిలదీశారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి, భూములు ఉన్న వారికి కేటాయించారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలోనూ గందరగోళ పరిస్థితి నెలకొన్నది. బిచ్కుంద మండలం గోపాన్పల్లిలో రేషన్‌కార్డులు ఇవ్వాలని గ్రామస్తులు ధర్నా చేశారు. బీబీపేట మండలం తుజాల్పూర్, మల్కాపూర్, ఇస్సానగర్‌లో నిర్వహించిన గ్రామసభల్లో స్థానికులు అధికారులను నిలదీశారు. తుజాల్పూర్లో అర్హులు కాకుండా ఇతరుల పేర్లు జాబితాలో రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై ప్రభాకర్ వచ్చి స్థానికులను సముదాయించారు. దోమకొండ మండలం అంచనూర్, చింతమాన్‌పల్లి, గొట్టిముక్కులలోనూ అధికారులను నిలదీశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని నాగిరెడ్డిపేట గ్రామసభలో రైతులు పట్టుబట్టారు. ఎల్లారెడ్డి మండలం రుద్రారంలో అనర్హులకు పథకాలు కేటాయించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను కాకుండా కాంగ్రెస్ నేతలు చెప్పిన వారి పేర్లనే జాబితాలో చేర్చారని నిలదీశారు. గందరగోళం నెలకొనడంతో గ్రామసభ వాయిదా పడింది.
సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవని స్థానికులు ఆందోళనకు దిగారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్ వచ్చి వారికి సర్దిచెప్పారు. నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోనూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయభరోసా లబ్ధిదారుల ఎంపికలో అర్హుల పేర్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీర్కూర్ మండలం భైరాపూర్, గాంధారి ంమడలం మాతుసంగెం, పర్మళ్ల తండా, చద్మల్, లింగంటపేట మండలం శెట్పల్లి, శెట్పల్లి సంగారెడ్డి, అయ్యపల్లి, అయ్యపల్లి తండా, ఎక్కపల్లి, మాలపాటి, మాలోత్ సంగ్యానాయక్ తండా, మాలోత్ తండా, సజ్జన్‌పల్లిలో గ్రామస్తులు నిరసన తెలిపారు. శెట్పల్లిలో ఆత్మీయ భరోసాకు 44 మందిని ఎంపిక చేయగా, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నలుగురిని మాత్రమే ఫైనల్ చేశారు. పర్మళ్ల, శెట్పల్లిసంగారెడ్డి తదితర గ్రామాల్లో రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దకొడప్గల్ మండలం బుర్గుపల్లి, చిన్నదేవిసింగ్తండా, పోచారం, చిక్కడ్పల్లి తదితర గ్రామాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి.
బోధన్ మండలం బెల్లాల్లో నిర్వహించిన గ్రామసభ గందరగోళంగా మారింది. ఇక్కడ పుట్టి పెరిగిన తమ పేర్లు జాబితాలో రాలేదని, బయటి నుంచి బతకడానికి వచ్చిన వారికి మాత్రం ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నవీపేట మండలం మహంతంలో గ్రామసభకు హాజరైన ఆర్డీవో రాజేందర్కుమార్ను గ్రామస్తులు నిలదీశారు. పూటకు తిండిలేని కుటుంబాలెన్నో ఉన్నా వాళ్లను కాదని, అనర్హులను ఎలా ఎంపిక చేస్తారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా జాబితాల్లో పేర్లు లేవని మోకాన్‌పల్లి గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరిలో నిర్వహించిన గ్రామసభలో ఆత్మీయభరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతు కావడంపై జనం అధికారులను నిలదీశారు. పరిస్థితి తీవ్రమవుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. రుద్రూర్ మండలం సులేమాన్‌నగర్‌లో స్థానికుల ఆందోళనతో గ్రామసభ మూడు గంటలకు పైగా నిలిచి పోయింది. పుట్టిన నాటి నుంచి గ్రామం లో ఉన్న వారికి కాకుండా వలస వచ్చిన వారికి రేషన్ కార్డులు ఇవ్వడమేమిటని నిలదీశారు.
96 మంది పేర్లు వస్తే అందులో 76 మంది వలస వచ్చిన వారేనని తెలిపారు. ఆత్మీయభరోసా జాబితాలో లబ్ధిదారుల ఇంటి పేర్లు, భర్తల పేర్లు లేకపోవడంతో జనం అయోమయానికి గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామసభను అడ్డుకున్నారు. దీంతో ఏసీపీ శ్రీనివాస్ వచ్చి గ్రామస్తులకు సర్దిచెప్పారు. డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి , డిచ్పల్లి తండా, సుద్దపల్లి, దేవుపల్లి క్యాంప్, మెం ట్రాజ్ పల్లి, నాకాతండా, యానంపల్లి, యానంపల్లి తండాల్లోనూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాబితాలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభు త్వ ఉద్యోగులు, అనర్హుల పేర్లు వచ్చాయని, అర్హులైన పేదలకు మొండిచేయి చూపారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మండలంలోని కొత్తపేట్, రామ్‌నగర్ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలో గందరగోళం జరిగింది. భూమి ఉన్న వారి పేర్లు ఆత్మీయ భరోసా కింద ఎలా వచ్చాయని అధికారులను నిలదీశారు.
బాల్కొండ, జనవరి 22 : కిసాన్‌నగర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం చోటుచేసుకున్నది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులైన పేదలకు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయి. కనీసం భూమిని సేకరించకుండానే ఇండ్లు ఇస్తున్నామంటూ ఆశ చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభల పేరిట ప్రజలను మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నది.
– ఏలేటి నాగభూషణం, కిసాన్‌నగర్
లబ్ధిదారుల ఎంపిక సరిగ్గాలేదు. గ్రామ పంచాయతీ సిబ్బంది చేసిన సర్వేను లెక్కలోకి తీసుకుంటలేరు. కొంతమంది అధికార పార్టీ నాయకులు పథకాల జాబితా నుంచి లబ్ధిదారుల పేర్లను తొలగించారు. వారు సూచించిన వారికే పథకాలు ఇస్తారని మాకు తెలుస్తున్నది.
-శరత్, కిసాన్‌నగర్