Nizamabad | కంటేశ్వర్, సెప్టెంబర్ 5 : నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరూ ఒకే వేదికపైకి రావాలని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
నిజామాబాద్ డెవలప్మెంట్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ.. 1931లో నిజాం పాలనలో నిజామాబాద్ మున్సిపాలిటీగా మారిన, 1987లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన, 2005లో మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడిన ఇప్పటి వరకు అసలైన అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిందని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు మారుతున్న నగరంలో మౌలిక వసతుల కల్పన జరగడంలేదని విమర్శించారు. పౌరుల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో మాత్రం యంత్రాంగం విఫలం చెందుతుందని దుయ్యబట్టారు.
నగర అభివృద్ధి కోసం, పరిస్థితుల్లో మార్పు కోసం, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, యువకులు, విద్యావంతులు, మేధావులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతులైన అందరిని ఏకం చేసి, సమస్యలపై నిరంతరం పోరాటం చేయడానికి నిజామాబాద్ డెవలప్మెంట్ ఫోరం పనిచేస్తుందని, అందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం తలపెట్టిన గొప్ప కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని కోరారు. అనంతరం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు నివసించే డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సిన వందల కోట్ల రూపాయల పన్నులను పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేయడంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కార్పొరేషన్‌కు భారీగా నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి, దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి.ప్రభాకర్, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాం భూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, వేధింపుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కేశవులు, తెలంగాణ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుప్పల రవి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య తదితరులు పాల్గొన్నారు.