మెరుగైన వసతులు.. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులను, ఘనతలను సొంతం చేసుకున్న బాన్సువాడ దవాఖానలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎంసీహెచ్, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో వైద్య సేవలు అందడమే గగనంగా మారింది. అనారోగ్యంతో వెళ్తే పట్టించుకునే వారే లేరు. ఏమైందని నాడి పట్టి చూసే వారే కరువయ్యారు. సకల వసతులు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా సరిపడా వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో నాడిపట్టే వారు లేకుండా పోయారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారిని చూసే వారు సైతం లేక కామారెడ్డి, నిజామాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు.
-బాన్సువాడ, ఆగస్టు 30
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో బాన్సువాడ దవాఖాన దశాదిశ మారిపోయింది. వంద పడకల దవాఖానలో అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చింది. మాతాశిశు సంరక్షణ కేంద్రం నెలకొల్పి గర్భిణులు, బాలింతలు, శిశువులకు అత్యాధునిక వైద్య సేవలు తీసుకొచ్చారు. ఫలితంగా జాతీయ స్థాయిలో పేరొచ్చింది. వరుసగా కాయకల్పతో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ వంటి అవార్డులు సైతం వరించాయి. మొన్నటిదాకా ఓ స్థాయిలో వెలుగొందిన దవాఖానల పరిస్థితి ఇప్పుడు దారణంగా తయారైంది. 45 మంది వైద్యులకు గాను 17మందే ఉన్నారు. అందులోనూ కొందరు కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు.
ఎంసీహెచ్‌లో గైనకాలజిస్టు పోస్టులు మూడు ఉంటే, ఇద్దరే ఉన్నారు. ముగ్గురు మత్తు డాక్టర్లకు గాను ఒక్కరు మాత్రమే అది కూడా కాంట్రాక్టు పద్ధ్దతిలో పని చేస్తున్నారు. ముగ్గురు పిల్లల వైద్యులు ఉండాల్సి ఉండగా, ఒక్కరూ లేరు. మూడు జనరల్ మెడిసిన్ పోస్టులకు గాను ఉన్నది ఒక్కరే. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలందిస్తున్నారు. మూడు జనరల్ సర్జన్ పోస్టులకు గాను ఒక్కరి(కాంట్రాక్ట్ విధానమే)తో నెట్టుకొస్తున్నారు. ఆర్థోపెడిక్ విభాగంలోనూ కాంట్రాక్ట్ విధానంలోనే సేవలందిస్తున్నారు.
రేడియాలజిస్టు డిప్యుటేషన్‌పై వస్తున్నారు. కంటి వైద్య నిపుణుడి పోస్టు ఖాళీగా ఉంది. ఈఎన్టీ డాక్టర్ ఉన్నత చదువులకోసమని వెళ్లగా, ఇక్కడ సేవలందించే వారు లేరు. పాథలాజీ విభాగంలో ఉన్న రెండు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. రెగ్యులర్ డెంటిస్టు లేకపోవడంతో కాంట్రాక్ట్ విధానంలో కానిచ్చేస్తున్నారు. సైకాలజీ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఫోరెన్సిక్ మెడిసిన్ అందించే వారూ కరువయ్యారు.
బాన్సువాడ ఏరియా దవాఖాన, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రోగుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, మెదక్ నియోజకవర్గాలతో పాటు పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. జనరల్ విభాగంలోనే నిత్యం 600 వరకు, చిన్నపిల్లల విభాగంలో 250 వరకు ఓపీ నమోదవుతుంటుంది. మహిళలు, గర్భిణులు, ఇతరత్రా సమస్యలతో వచ్చే వారితో సహా వెయ్యి మంది వరకు నిత్యం వైద్య సేవల కోసం వస్తుంటారు. కానీ వైద్యులు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, కుటుంబ సభ్యులు ఆగమవుతున్నారు.
దవాఖానలో వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమే. గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు, ఇతర డాక్టర్లు అవసరం ఉంది. మొత్తం 45 మందికి గాను ప్రస్తుతం 17 మంది పని చేస్తున్నారు. అయినప్పటికీ రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఖాళీల భర్తీ కోసం కలెక్టర్‌కు విన్నవించాం. త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.
– విజయలక్ష్మి, దవాఖాన సూపరింటెండెంట్
మా వాళ్లకు పాణం మంచిగ లేకపోతే రాత్రి బాన్సువాడ సర్కారు దవాఖనకు తీసుకొచ్చిన. కడుపు నొప్పితో గిలగిల కొట్టుకుంటుంటే పట్టించుకునేటోళ్లే లేరు. పేరు రాసుకున్నరు తప్పితే రోగిని చూసేటోళ్లే లేరు. ఆడ పని చేసేటోళ్లని వోళ్లని అడిగినా పట్టించుకుంటలేరు. గిదేందని గట్టిగా అడిగితే డాక్టర్లు లేరని చెప్పిండ్రు. మస్తు తిప్పలైంది. అరె పాణం మంచిగ లేదని అస్తే డాక్టర్లు లేరని చెప్పుడేంది.
– చరణ్, జేకే తండా, బాన్సువాడ
మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనూ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు గైనకాలజిస్టులకు గాను ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పిల్లల డాక్టర్లు ఉండాల్సి ఉండగా, ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఇద్దరు మత్తు వైద్యులు, సివిల్ సర్జన్, జనరల్ సర్జన్ అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.