బిచ్కుంద, అక్టోబర్ 14: పండుగకు సొంతూళ్లకు చేరుకున్న ప్రజలకు తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ చుక్కలు చూపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడంలో రవాణా సంస్థ పూర్తిగా విఫలమైంది. బస్సులు రాక ప్రయాణికులు పొద్దంతా బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితినెలకొంది. కొందరేమో ఆర్టీసీ తీరును తిట్టుకుంటూ ఇండ్లకు వెళ్లిపోగా, మరికొందరేమో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. మరోవైపు, ప్రయాణికుల అవసరాన్ని ప్రైవేట్ వాహనాలు సొమ్ము చేసుకున్నాయి.
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా బతుకమ్మ, దసరా సెలవుల సందర్భంగా సొంతూళ్లకు చేరారు. ఇంటిల్లి పాదితో కలిసి ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. సెలవులు ముగియడంతో తిరిగి వెళ్లేందుకు సోమవారం ఉదయమే ముల్లెమూటతో బస్టాండ్లకు చేరుకున్నారు. తొందరగా వెళ్లి విధుల్లో నిమగ్నం కావొచ్చనుకున్న వారికి ఆర్టీసీ ఊహించని షాక్ ఇచ్చింది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడలేక చేతులెత్తేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్సు రాకపోవడంతో అసహనానికి లోనయ్యారు. బిచ్కుంద బస్టాండ్‌కు వచ్చిన వారి ఓపికకు ఆర్టీసీ పరీక్ష పెట్టింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్, సంగారెడ్డి రూట్లో అరగంటకు ఒక బస్సు తిరిగేది. కానీ సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్క బస్సు కూడా రాలేదు.
నిజామాబాద్ బస్టాండ్‌లో సీటు కోసం కిటికీలో నుంచి బస్సులోకి బాలుడిని తోస్తున్న ప్రయాణికుడు, సీటు కోసం తిప్పలు పడుతున్న వృద్ధుడు
ఖలీల్‌వాడి, అక్టోబర్ 14: దసరా పండుగ అయిపోవడంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. అయితే, బస్సులు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ తదితర బస్టాండ్లు సోమవారం తెల్లవారుజాము నుంచే కిటకిటలాడాయి. అరగంట, గంటకొకటి చొప్పున వచ్చే అరకొర బస్సుల వెంట జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో బస్సులో సీటు ఏమో కానీ కనీసం కాస్త చోటు దొరికినా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న భావన ప్రయాణికుల్లో కనిపించింది. నిజామాబాద్ బస్టాండ్‌లో రద్దీ కారణంగా ఓ ప్రయాణికుడు సీటు కోసం బస్సు కిటికీ లోంచి లోపలికి బ్యాగు వేసే క్రమంలో అద్దం పగిలి పోయింది. దీంతో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి వాగ్వాదం జరుగగా, ఆర్టీసీ అధికారి స్వరూపరాణి వచ్చి సర్దిచెప్పారు. సరిపడా బస్సులు వేస్తే ఇలాంటి పరిస్థితులు రావు కదా అని తోటి ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు.
దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చా. సంగారెడ్డికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చా. మూడు గంటలై పోయింది. ఒక్క బస్సు కూడా రాలేదు. ప్రైవేట్ వాహనంలో వెళ్దామంటే రూ.300 దాకా అడుగుతున్నారు.
– వైష్ణవి, విద్యార్థిని, బిచ్కుంద
నేను హైదరాబాద్‌లో జాబ్ చేస్తా. దసరా పండుగకు ఇంటికి వచ్చా. తిరిగి వెళ్లేందుకు ఉదయమే బస్టాండ్‌కు చేరుకున్నా. 10 గంటల నుంచి వేచి చూస్తున్నా. మధ్యాహ్నం ఒంటిగంట దాటినా ఒక్క బస్సు కూడా రాలే. బాన్సువాడ మీదుగా వెళ్దామన్నా అటువైపు వెళ్లే బస్సులు కూడా రాలేదు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే టికెట్ కంటే రెండింతలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు.
– రాజు, బాబుల్‌గావ్ గ్రామం
బతుకుదెరువు కోసం హైదరబాద్‌కు పోయినం. పండుక్కని మా సొంతూరు సిర్సముందర్కు అచ్చినం. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ పోవాలె. పొద్దుగళ్లనే బస్టాండ్‌కు అచ్చినం. రొండు గంటల సంది బస్సులే రాలే. జీపులల్ల పోదామంటే ఐదొందలు అడుగుతుండ్రు. ఏం జేయాల్నో సమజైత లేదు.
– సావిత్రి, సిర్సముందర్ గ్రామం
ఆర్టీసీ వైఫల్యాన్ని ప్రైవేట్ వాహనాలు సొమ్ము చేసుకున్నాయి. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని దండుకున్నాయి. ఆర్టీసీ బస్సులు లేక, బస్టాండ్లలో పడిగాపులు కాయలేక కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా వారు టికెట్‌పై రెండింతల చార్జీలు అదనంగా వసూలు చేశారు. తప్పనిసరై వెళ్లాల్సి రావడంతో అదనపు భారం మోయక తప్పలేదు. హైదరాబాద్ మార్గంలో కిక్కిరిసిన ప్రయాణికులతో ప్రైవేట్ వాహనాలు దూసుకెళ్లాయి.