Pending Bills | పెద్ద కొడప్గల్ (పిట్లం), ఫిబ్రవరి 18: గ్రామపంచాయతీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మంగళవారం ఎంపీడీవో కమలాకర్‌కు మండలంలోని గ్రామపంచాయతీల కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కమలాకర్, ఎంపీఓ రాములకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం సమర్పించారు. పంచాయతీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో గతేడాది ఫిబ్రవరి 24న పంచాయితీల పాలకవర్గం కాల పరిమితి ముగిసింది.
పాలక వర్గం గడువు ముగిసిన తరువాత పంచాయితీలలో రోజువారీగా పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ డీజిల్, దాని మరమ్మత్తులు, బ్లీచింగ్ పౌడర్, బయోటెక్స్ పారిశుద్ధ్య సామాగ్రి, వీధి దీపాల నిర్వహణకు షాపుల్లో చెక్‌లు అందజేశామని తెలిపారు. కానీ ఆ బిల్లులు పేమెంట్ కాక ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే తాగునీటి నిర్వహణ సమర్థవంతంగా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెలాఖరు కల్లా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వారు కోరారు.