వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలి
చేపట్టాల్సిన పనుల జాబితా ముందుగానే రూపొందించాలి
కలెక్టర్ నారాయణరెడ్డి
జూన్ 3 నుంచి 17వ తేదీ వరకు నిర్వహణ
సమీక్షాసమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి
ఖలీల్వాడి, మే 23 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 3 నుంచి 17వ తేదీ వరకు పల్లెప్రగతి కొనసాగుతుందన్నారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆయాశాఖల అధికారులతో పల్లెప్రగతిపై సోమవారం సాయంత్రం సమీక్షాసమావేశం నిర్వహించారు. వందశాతం లక్ష్యసాధన దిశగా పల్లెప్రగతి పనులను చేపట్టాలని ఆదేశించారు. మండల, గ్రామస్థాయి ప్రత్యేకాధికారులు స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుని క్షేత్రస్థాయిలో పల్లెప్రగతి అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. సర్పంచులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రాధాన్యతను తెలియజేయాలని, వారు తప్పనిసరిగా కార్యక్రమంలో భాగస్వాములై లక్ష్యసాధనకు కృషి చేసేలా చూడాలన్నారు.
ప్రత్యేకంగా ఎంపిక చేసిన 139 గ్రామపంచాయతీల పరిధిలో బృహత్ ప్రకృతి వనాలు పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పల్లెప్రగతి కార్యక్రమం ముగిసే నాటికి పనులన్నీ వందశాతం పూర్తికావాలని స్పష్టం చేశారు. అలసత్వాన్ని ప్రదర్శించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువ గట్ల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలను నాటనున్న నేపథ్యంలో ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. అదేవిధంగా అటవీశాఖకు చెందిన అనువైన బ్లాక్లను సైతం మొక్కలను నాటేందుకు ఎంపిక చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తిస్తే పల్లెప్రగతిలో మంజూరు చేస్తామన్నారు. ఆసరా పింఛన్లకు అర్హుల వివరాలను సేకరించాలని, చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉండకుండా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రత్యేకాధికారులదేనని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.