శక్కర్‌నగర్, జనవరి 7: అయోధ్య భవ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం, స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణలో విశిష్ఠత కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటుకు చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకుడు శ్రీ రామదాసి సురేశ్ ఆత్మారాం మహరాజ్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఆయన హైదరాబాద్‌లో తయారు చేయించిన పాదుకలను తీసుకొని మరో 20 మంది శిష్య బృందంతో ఈనెల 6న అయోధ్యకు చేరుకున్నారు. ఈ పాదుకలకు ఆదివారం అయోధ్యలోని భరత్‌కుండ్ సరోవరం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని తీసుకొని తెలంగాణకు పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన అయోధ్య నుంచి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ తాను శిష్యబృందంతో కాలినడకన, పాదుకలు తెస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తేదీ ఈనెల 22 నాటికి వీటిని ఇటీవల తాను ప్రారంభించిన ‘కొండగట్టు’ గిరి ప్రదక్షిణ రహదారిలో ఓ పాదుకల జతను, బోధన్ శివారులోని నర్సాపూర్ దివ్యసంజీవనీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద మరో జత ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పాదయాత్ర నిరంతరంగా సాగుతోందని, 22 నాటికి ఆయా స్థలాలకు చేరకుంటామని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణ విశిష్టతను తెలుపుతూ.. తెలంగాణ ప్రాంతంలో గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు.