Gandhari | గాంధారి, ఆగస్టు 4 : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుపోయి, పంట దెబ్బతింది. వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పొలాల్లోని మట్టి, రాళ్లు పేరుకుపోయి సాగుకు అనుకూలంగా లేని పరిస్థితి ఏర్పడింది. రైతులు ఎంతో ఖర్చుతో నాటు వేయగా, ఒక్క రాత్రిలోనే మొత్తం పంట నీటిపాలవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ అకాల వర్షం మరింత భారంగా మారిందని వారు వాపోయారు.
విషయం తెలుసుకున్న గ్రామ రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. నష్టాన్ని స్వయంగా పరిశీలించి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా వరుసగా పంటలు దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.