కాలం కరుణించింది.. రైతన్న పంట పండింది.. ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయి. పుట్ల కొద్దీ వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. వేగంగా కాంటా ప్రక్రియ పూర్తవుతున్నది. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో నీరసించి పోయిన రైతాంగానికి సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారు. ఫలితంగా రెండు జిల్లాల్లో ఈసారి కూడా అంచనాలకు మించి దిగుబడులు వస్తున్నాయి. దంచికొట్టిన వానలు, దండిగా నీళ్లు, నిరంతర కరెంటుతోపాటు వాతావరణం కూడా అనుకూలించింది. దీంతో పడావు భూములే కనిపించకుండా పోయిన వేళ.. కనుచూపు మేర పచ్చదనమే విచ్చుకున్నది. పంట కోతల్లో రైతాంగం నిమగ్నమైన తరుణంలో.. దండిగా వస్తున్న ధాన్యాన్ని చూసి అన్నదాతల కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. కర్షకులకు ఇబ్బందులు లేకుండా, మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎంత సతాయించినా బెదరకుండా ధాన్యం సేకరిస్తున్నది. గత పది రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో 17,255 మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు చేపట్టారు.
నిజామాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఊహించని వర్షాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన వానకాలం సీజన్ భయాందోళనల మధ్య ముగిసింది. సమృద్ధిగా కురిసిన వర్షాలతో పంట లు వేసిన రైతులు ఇప్పుడు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. భారీ వానల మూలంగా పలు చోట్ల రైతులకు చేటు కలిగినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరికి తెగుళ్ల బెడద అన్నది తీరింది. ఏకధాటి వానలతో వరి పైరు ఏపుగా పెరగడంతో పాటుగా చీడ పురుగు బారి నుంచి తప్పించుకున్నది. వరి గింజ ఎదిగే సమయంలో నెమ్మదించిన వానలు దిగుబడులను పెంచేందుకు ఉపయుక్తమైనట్లుగా రైతులు చెబుతున్నారు. భారీ వానలతో అపార నష్టాలు సంభవిస్తాయని బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణా ల నుంచి ఆశాజనకంగా పంట ఉత్పత్తులు వస్తుండడంతో ఇప్పుడు రైతుల్లో జోష్ నింపుతున్నది. శ్రమకోర్చి పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరను కల్పించి అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు గతం మాదిరిగానే సర్వం సిద్ధం చేసింది. ఉభయ జిల్లాల్లో వందలాది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా సగానికి ఎక్కువ ప్రాంతాల్లో కేంద్రాలు షురూ అయ్యాయి. మిగిలినవి వారం, పది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొంటున్నారు.
500 కేంద్రాల్లో సందడి…
నిజామాబాద్ జిల్లాలో ఈసారి 477 ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 11 వ్యవసాయ మార్కెట్లు, 395 పీఏసీఎస్‌లు, 66 ఐకేపీ సెంటర్లు, మెప్మా ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 22వ తారీఖు నుంచి నేటి వరకు 290 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా చోట్ల ధాన్యం రాకను అనుసరించి కేంద్రాలను తెరుస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోనే జోరుగా ధాన్యం సేకరణ షురూ అయ్యింది. ఇక కామారెడ్డి జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 211 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకు ధాన్యం సేకరణలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ సారి వరి పంట ఉత్పత్తులకు తెగుళ్ల బెడద అంతగా లేదన్న సంకేతాలున్న నేపథ్యంలో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రైస్ మిల్లుల నుంచి దోపిడీ అన్నది లేకుండా రైతులకు పక్కాగా న్యాయం జరిగే విధంగా ధాన్యాన్ని సేకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నేటి వరకు 501 కేంద్రా లు ప్రారంభమయ్యాయి.
20వేల మెట్రిక్ టన్నుల సేకరణ
గడిచిన 10 రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో 17వేల 255 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం విలువ రూ.35 కోట్లు. మొత్తం 2,552 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కామారెడ్డి జిల్లాలో వేయి మంది రైతుల నుంచి సుమారు 2500 మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో కేంద్రాలు తెరుచుకోగా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు సేకరిస్తున్నారు. అక్కడక్కడా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తిన చోట అధికారులు రంగ ప్రవేశం చేసి పరిస్థితులను చక్కబెడుతున్నారు. రైతులకు దళారుల బెడద నుంచి పూర్తిగా విముక్తి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ధాన్యం విక్రయించేందుకు ఏటా అన్నదాతలకు అవస్థలు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తూకంలో జాప్యం, మోసాలను నివారిస్తూ మద్దతు ధరను అందిస్తోంది. మిల్లులకు తరలించడంలో వాహనాల కొరత, డబ్బులు చెల్లింపులో ఆలస్యం ఇలా అనేక సమస్యలను ఎప్పటికప్పుడు నివారించుకుంటూ రైతులకు కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల్లో సమస్యలను నేరుగా ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు.
సన్నాలకు ఎగబడుతున్న వ్యాపారులు
వానకాలం వచ్చిందంటే రైతులంతా తమ పొట్ట కోసం సన్న రకం వరిని సాగు చేస్తుంటారు. తమకున్న భూమిలో సగం మేర సన్నాలకు కేటాయిస్తుంటారు. ఈ రకంగా ఉభయ జిల్లాలోనూ రైతులు సన్నాలను సాగు చేయగా చేతికొచ్చిన పంటలను ప్రైవేటు వ్యాపారులు పోటీపడి సేకరిస్తున్నారు. ఇంచుమించుగా క్వింటాలుకు రూ.1950 చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారు. కల్లాల వద్దకే వచ్చి పంటను సేకరిస్తుండడంతో రైతులు సైతం వెంటనే ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. ప్రైవేటు దళారులు ఒకరికొకరు పోటీపడి సన్నాలను కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. సన్నరకం ధాన్యంతో ప్రైవేటు మిల్లర్లు మర ఆడించిన తర్వాత హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో భారీ లాభాలకు అమ్ముకుంటున్నారు. ఇందుకోసం వానకాలం సీజన్లో వచ్చే సన్నాలపై పెద్ద మొత్తంలో దృష్టి సారిస్తున్నారు. అయితే తక్కు వ ధరకు ప్రైవేటు వ్యక్తులకు పంటను విక్రయించి మోసపోవద్దని రైతులకు ప్రభుత్వం సూచిస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు పంట ఉత్పత్తులను తీసుకు వస్తే మద్దతు ధరను పొందవచ్చని చెబుతున్నారు.
నాణ్యమైన ధాన్యానికి కడ్తా తీస్తే కఠిన చర్యలు : కలెక్టర్ నారాయణరెడ్డి
ఖలీల్‌వాడీ(మోపాల్), నవంబర్ 2 : నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు, కోతలు లేకుండా రైతుకు పూర్తిస్థాయిలో మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ధాన్యానికి ఎవరైనా కడ్తా తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడ్తా అమలు చేసే రైస్‌మిల్లులను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. బోర్గాం(పి), మోపాల్, నర్సింగ్‌పల్లి, కాస్బాగ్ తండా, బాడ్సీ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ…
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చాలా చోట్ల రైతులకు అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం నిర్దేశించుకున్న కొనుగోలు కేంద్రాల్లో సగానికి ఎక్కువ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. జోరుగా ధాన్యం సేకరణ జరుగుతున్నది.
– చంద్రప్రకాశ్, పౌరసరఫరాల శాఖ అధికారి
రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు…
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియను చేపడుతున్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 211 కేంద్రాలను ప్రారంభించగా ధాన్యం సేకరణ పలు కేంద్రాల్లో షురూ అయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నాం.
– జితేంద్ర ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్