నాగస్వామిని సన్మానించిన జిల్లా అధికారులు
భిక్కనూర్, జూలై 19 : తక్కువ ఖర్చుతో వరి నాటే యం త్రాన్ని తయారుచేసిన భిక్కనూర్ మం డలం కాచాపూర్ గ్రా మానికి చెందిన నాగస్వామిని జిల్లా అధికారులు అభినందించి, సన్మానించారు. వరి సాగు రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు నాగస్వామిలో వచ్చిన ఆలోచన నూతన ఆవిష్కరణకు దారితీసింది. ఐటీఐ పూర్తిచేసిన నాగస్వామి యూట్యూబ్, తమ్ముడి సాయంతో సుమారు రూ. 50వేలతో వరి నాట్లు వేసే యంత్రాన్ని తయారుచేసి అంద రి మన్ననలు పొందుతున్నాడు. మంగళవారం జిల్లా సైన్స్ అధికారి సిద్ధారాంరెడ్డి నాగస్వామి తయారుచేసిన యంత్రాన్ని పరిశీలించి, ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ.. నాగస్వామి తయారుచేసిన వరి నాటే యంత్రాన్ని ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సహకారంతో ఈ యంత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా వినియోగంలోకి వచ్చేలా చూస్తామన్నారు. పేటెంట్ హక్కులు ఇప్పించి తయారుచేయడానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఆనంద్ మాట్లాడుతూ..యంత్రం పనితీరు బాగుందని, దీనిని రైతులందరూ ఉపయోగించి నాట్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు శ్రీనివాసాచారి, గ్రామస్తులు సంపత్ ప్రేమ్, రాజ్ నర్సింహులు, కృష్ణ, వీఆర్ఏలు దశరథం, స్వామి, టీచర్లు శ్రీకాంత్, రాజమణి పాల్గొన్నారు.