వినాయక్‌నగర్, జూలై 8: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల అమలుతీరును పరిశీలించేందుకు బీపీఆర్డీ, ఎన్సీఆర్బీ, సీడీఐటీ, ఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ డీఐజీ రాజశేఖర్ సోమవారం జిల్లాలో పర్యటించారు. కమిషనరేట్‌లో సీపీ కల్మేశ్వర్ సింగేనవార్తో కలిసి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనియం చట్టాల అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో చర్చించి, వారి సందేహాలు,అభిప్రాయాలను సేకరించారు. అంత కు ముందు జిల్లా న్యాయ అధికారి సునీత కుంచాల, ఇతర న్యాయమూర్తులను కలిసి నూతన కొత్త చట్టాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించారు. అనంతరం నిజామాబాద్ ఒకటో టౌన్, డిచ్పల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఎస్‌హెచ్‌వోలు, ఐటీ కోర్ సిబ్బంది, స్టేషన్ రైటర్స్‌తో మాట్లాడారు.
సాయంత్రం కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీసు అధికారులతో చర్చించారు. నేర న్యాయ చట్టాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, న్యాయవాదులు, ప్రభుత్వ దవాఖాన డాక్టర్ల అభిప్రాయాలు సేకరించారు. ఆయన వెంట మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన కుర్ర శ్రీనివాస్, రాజేశ్ కుమార్, సూరేపల్లి శ్రీనివాస్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, బస్వారెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, సీసీఆర్బీ ఏసీపీ రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తదితరులు ఉన్నారు.