ఖలీల్‌వాడి, మే 4 : జిల్లా ప్రభుత్వ దవాఖానలో క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ సేవలు అందించనున్నారు. దీంతో రోగుల ఇబ్బందులు తొలగనున్నాయి. జీజీహెచ్‌కు ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చి ఓపీ సేవల కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించేవారు. ఇందులో ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందులను దూరం చేయడానికి క్యూఆర్ (స్కాన్ అండ్ షేర్) సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తెలిపారు. క్యూఆర్ సేవలతో ఓపీ కోసం వరుసలో నిలబడే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు ‘ఏబీడీఎం’ అనే యాప్ ద్వారా దవాఖానలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వచ్చిన క్యూ నంబర్‌ను ఓపీ కౌంటర్లో చెబితే ఓపీ కార్డు జారీ చేస్తారని వివరించారు.