నిజామాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోతే ధరలు పెరగడం సహజం. ఈ ఆర్థిక సూత్రాన్ని వంటబట్టించుకున్న కొందరు దళారులు సరఫరా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మార్కెట్లోకి ఉల్లి రాకుండా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఫలితంగా వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
దళారుల దోపిడీకి అటు ప్రజలు, ఇటు చిరు వ్యాపారులు చితికి పోతున్నారు. టన్నుల కొద్దీ నిల్వలు పెట్టుకున్న కొందరు హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమంగా కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తూ వారు మాత్రం రెండు చేతులా సంపాదిస్తున్నారు. మహారాష్ట్రలోని పంట పరిస్థితులను సాకుగా చూపి అక్కడ లభించే ధరకు మూడు, నాలుగు రెట్లు అదనంగా ఇక్కడి వ్యాపారులు వసూలు చేస్తున్నారు. జనం దోపిడీకి గురవుతున్నా సంబంధిత యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఫలితంగా దళారుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన ఉల్లి సాగుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతులను ఉల్లి సాగు వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. గతంలో కేసీఆర్ సర్కారు హయాంలో ఈ తరహా ప్రయత్నం చేసినప్పటికీ సంబంధిత శాఖ మొద్దు నిద్ర మూలంగా రైతుల్లో చైతన్యం కొరవడింది. మార్కెట్లో అధిక లాభాలను అందించే ఉల్లి సాగు విషయంలో రైతులను ప్రోత్సహిస్తే ఓ వైపు ప్రజలకు, మరోవైపు వ్యాపారులకు లాభించే వీలు ఉంది. కానీ ఆ దిశగా ఉద్యాన శాఖ ప్రణాళికలు రూపొందించడం లేదు.
ఈ శాఖను నడిపించేందుకు ఉన్నతాధికారులు, ఉభయ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు సైతం చొరవ తీసుకోవడం లేదు. పొరుగు రాష్ర్టాల నుంచి ఉల్లి పంట దిగుమతులు పెరుగుతుండటంతో పాటు భారత్ నుంచి ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం, ఇతర దేశాల నుంచి దిగుమతులు ప్రోత్సహించడం వంటి చర్యలతో ఉల్లి ధరలు ఇప్పటికే నేల చూపులు చూడాలి. కానీ, అలాంటి మార్పు కనిపించకపోవడం వెనుక బడా వ్యాపారులు వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
మహారాష్ట్రలో పంట దెబ్బతిన్న కారణంగా సరుకు భారీగా రావడం లేదని సాకు చెబుతూ వ్యాపారులు భారీగా డంప్‌లను పెట్టారు. నిజామాబాద్‌లోని అర్సపల్లి శివారు ప్రాంతాల్లో టన్నుల కొద్దీ నిల్వలు పోగై ఉన్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా మార్కెట్లోకి ఉల్లిని పంపించకుండా, కృత్రిమ కొరతను కొంత మంది దుండగులు సృష్టిస్తున్నారు. అధిక ధరలకు హోల్ సేల్ వ్యాపారులు విక్రయించడం మూలంగా రిటైల్ వ్యాపారులు కూడా కిలో ఉల్లిని రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉల్లి ధరల మాయాజాలంలో దళారులు చెలరేగిపోతున్నారు.
సెప్టెంబర్ వరకు ఒడిదొడుకులతో కొట్టుమిట్టాడిన ఉల్లి ధరల వ్యత్యాసం ఇప్పుడేకంగా స్థిరంగా రూ.200లకు 5కిలోలు చొప్పున విక్రయించే పరిస్థితికి వచ్చింది. ఉల్లి ధర తగ్గదా? అని ప్రశ్నిస్తే ఏదో ఒక బూచీ చూపిస్తున్నారు. అక్టోబర్‌లో తలెత్తిన వర్షాల ప్రభావంతో ఉల్లి రాక మందగించినప్పటికీ ప్రస్తుతం ఉల్లి లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ దళారులు మాత్రం తమ లాభార్జన కోసం ఇంకా కొరతను సృష్టిస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. నిజామాబాద్ శివారుతో పాటు కామారెడ్డి జిల్లాలోని గంజ్ ప్రాంతంలోనూ భారీగా ఉల్లి నిల్వలు ఉన్నాయి. వీటిని మార్కెట్లోకి సరైన రీతిలో పంపిస్తే ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట దక్కే వీలుంది. నాలుగేళ్ల క్రితం ఉల్లి కిలోకు రూ.15కే లభించింది. కానిప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పావు కిలో కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రహస్యంగా పలు ప్రాంతాల్లో భారీగా ఉల్లిగడ్డలు నిల్వ చేసినట్లు తెలిసింది. టన్నుల కొద్దీ ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకుని, వాటిని డిమాండ్‌కు సరిపడా బయటకు తీయకుండా కొద్ది మొత్తంలోనే అందుబాటులోకి తీసుకొస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉల్లి విక్రయాలతో లాభాలు పొందాలనుకునే చిరు వ్యాపారులు బోల్తా కొడుతున్నారు. దళారులు,
బడా వ్యాపారుల మాయాజాలంలో చితికి పోయి విలవిల్లాడుతున్నారు. ధరల హెచ్చు తగ్గుల వల్ల కొనుగోళ్లకు పరుగులు తీసి చిరు వ్యాపారులతో పాటే వినియోగదారులు నష్ట పోతున్నారు. కళ్ల ముందు ఇంతటి భారీ దందా జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు.
ఉల్లిగడ్డల కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వ్యాపారులు 80శాతం మహారాష్ట్ర మార్కెట్‌పైనే ఆధారపడతారు. కొత్త పంట లేకపోవడం వల్ల పాత పంటనే అధికంగా వస్తున్నది. పాత, కొత్త సీజన్ల మధ్య ఉల్లి మార్కెట్ ఒడిదొడుకులకు గురవుతున్నది.వానాకాలం మధ్యలో ఇలాంటి ఆటుపోట్లు ఎదురవ్వడంపరిపాటి. కానీ నెలల తరబడి ధరలను భారీగా పెంచేసి కొనసాగించడమే అందరికీ ఇబ్బందిగా మారింది. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్ మధ్య ఇలాంటి పరిస్థితులు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తాయి. ఈ సమయంలో ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి కొంత సరుకు వచ్చి ఆదుకుంటున్నది. తెల్ల, ఎర్ర ఉల్లిగడ్డ కిలోకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఆదివారాల్లో మరింత బాదుతున్నారు.