బిచ్కుంద, జూన్ 14: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. అయితే, అత్తా కోడలి మధ్య గొడవే ఆమె మృతికి కారణమని, కోడలే తన భార్య గొంతు నులిమి చంపిందని మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మోహన్‌రెడ్డి, స్థానికుల కథనం మేరకు.. బండారెంజల్ గ్రామానికి చెందిన దొబ్బ విఠబోయి తన భార్య బాలవ్వ (65), కుమారుడు బాబు, కోడలు అంజవ్వ, ఇద్దరు మనువళ్లతో కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఆర్నెళ్ల క్రితం పెద్ద కూతురు భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతుండగా విఠబోయి దంపతులు దవాఖానలో చూపిస్తున్నారు. అయితే, అది నచ్చని కోడలు అంజవ్వ తరచూ అత్తతో గొడవ పడేది. ఆడపడుచు కోసం అప్పులు తెచ్చి మరీ డబ్బులు ఖర్చు పెడుతున్నారని పోరు పెట్టేది. 15 రోజుల క్రితం పంట అమ్మగా వచ్చిన రూ.48 వేలు తమకే ఇవ్వాలని అత్తతో గొడవకు దిగిన కోడలు.. లేకపోతే చంపేస్తానంది. అయితే, శుక్రవారం విఠబోయి, ఆయన కుమారుడు బాబు బయటకు వెళ్లగా, ఇంట్లో అత్త, కోడలు మాత్రమే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ విఠబోయి ఇంటికి వచ్చేసరికి బాలవ్వ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. అయితే, ఉదయం అత్త కోడలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారని చుట్టుపక్కల వాళ్లు చెప్పడంతో కోడలే తన భార్యను గొంతు పిసికి చంపేసిందని విఠబోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.